వానరమూకతో బెంబేలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:50 AM
పట్టణ ప్రజలకు రాత్రింబవళ్లు వానర దండు చుక్కలు చూపిస్తున్నాయి.
ఎలమంచిలిలో రేయింబవళ్లు కోతులు స్వైరవిహారం
గుంపులు గుంపులుగా వీధుల్లో సంచారం
ఇళ్లల్లోకి చొరబడి దాడి చేస్తుండడంతో భయాందోళన
ప్రజల సమస్యను పట్టించుకోని మునిసిపల్ అధికారులు
ఎలమంచిలి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
పట్టణ ప్రజలకు రాత్రింబవళ్లు వానర దండు చుక్కలు చూపిస్తున్నాయి. ఏ వీధిలో చూసినా కోతులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ సమస్య నిన్న, మొన్నటిది కాదు. సుమారు పదేళ్ల క్రితం నుంచి పట్టణ వాసులు కోతుల బెడదను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ తీవ్రంగా పరిగణించడంలేదు. కోతల బెడదను నివారిస్తామని చెబుతున్నారే తప్ప అమలు చేయడంలేదు.
ఎలమంచిలి పట్టణంలో ఇటీవల కాలంలో కోతుల సంతతి విపరీతంగా పెరిగిపోయింది. గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. కొబ్బరి, మామిడి, జామ, ఉసిరి, మునగ, తదితర చెట్టపైకి ఎక్కి పండ్లు, కాయలను తెంపేస్తున్నాయి. కుండీల్లో పూల మొక్కలను పీకేస్తున్నాయి. ఆవరణల్లో, మేడపైన ఆరబెట్టిన ఆహార పదార్థాలను పాడుచేస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా అడ్డుకుంటే.. మూకుమ్మడిగా దాడి చేసి భయపెడుతున్నాయి. ఒంటరిగా వుంటే.. దాడి చేసి కరుస్తున్నాయి. కోతుల బెడద కొత్తపేట, మిలట్రీకాలనీ, రామ్‌నగర్, ఏఎస్‌ఆర్ కాలనీ, నాగేంద్రకాలనీ, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్, రైల్వే స్టేషన్ రోడ్డు, గాంధీనగర్ ప్రాంతాల్లో అధికంగా వుంది. కోతులు వీధుల్లో గుంపులుగా సంచరిస్తుండడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు భయపడుతున్నారు. కోతుల సమస్యను గతంలో పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. సుమారు పదేళ్ల క్రితం మునిసిపల్ అధికారులు కోతులను పట్టించే కార్యక్రమం చేపట్టారు. తరువాత ఒకటి, రెండేళ్ల వరకు కోతుల జాడ లేదు. ఆ తరువాత ఒక్కొక్కటిగా కోతుల రాక మొదలైంది. ఇప్పుడు పట్టణంలో వందల సంఖ్యలో కోతులు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వీటిని పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలించాలని మునిసిపల్ అధికారులను కోరుతున్నారు.
కాగా మునిసిపాలిటీలో కోతుల బెడదపై కమిషనర్ బీకేవీ ప్రసాదరాజును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. కోతులను పట్టేవారు ఈ ప్రాంతంలో లేరని, వేరే ప్రాంతాల వారు ఒక్కో కోతికి రూ.1,000 చొప్పున డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ కోతులను పట్టించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.