Share News

టెన్త్‌ ఫలితాలు నిరాశాజనకం

ABN , Publish Date - Apr 24 , 2025 | 01:06 AM

ఈ ఏడాది జిల్లాలో పదవ తరగతి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో మొత్తం 11,472 మంది విద్యార్థులకు గానూ కేవలం 5,465 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, 6,007 మంది ఫెయిలయ్యారు.

టెన్త్‌ ఫలితాలు నిరాశాజనకం
పాడేరులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం

జిల్లాలో ఉత్తీర్ణత 48 శాతం

గతేడాదితో పోలిస్తే 42 శాతం తగ్గుముఖం

రాష్ట్రంలో ఆఖరి స్థానంలో నిలిచిన జిల్లా

అధ్వానంగా విద్యా వ్యవస్థ

మూడేళ్లుగా డీఈవో లేని దుస్థితి

పాడేరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో పదవ తరగతి ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో మొత్తం 11,472 మంది విద్యార్థులకు గానూ కేవలం 5,465 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించగా, 6,007 మంది ఫెయిలయ్యారు. దీంతో ఉత్తీర్ణత శాతం 48 కాగా, ఫెయిల్‌ శాతం 52గా నమోదైంది. గతేడాది (2024) 90 శాతం ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 48 శాతానికి పరిమితమైంది. జిల్లాలో గురుకుల విద్యాలయాల్లో ఒక మోస్తరుగా ఉత్తీర్ణత సాధించగా, ప్రభుత్వ ఉన్నత, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు దక్కలేదు. కానీ సూపర్‌- 50 పేరిట ఐటీడీఏ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక బోధన చక్కని ఫలితాలిచ్చింది.

అధ్వానంగా విద్యా వ్యవస్థ

జిల్లాలో విద్యా వ్యవస్థ అత్యంత అధ్వానంగా ఉండడం వల్లే ఈ ఏడాది టెన్త్‌లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారనే వాదన బలంగా వినిపిస్తున్నది. ముఖ్యంగా జిల్లాలో విద్యా వ్యవస్థను పర్యవేక్షించే జిల్లా విద్యాశాఖాధికారి పోస్టు గత మూడేళ్లుగా ఖాళీగానే ఉంది. పాడేరు డివిజన్‌కు మాత్రమే పరిమితమయ్యే ఏజెన్సీ డీఈవోకే ఇన్నాళ్లుగా జిల్లా విద్యాశాఖాధికారి పోస్టును ఇన్‌చార్జిగా అప్పగిస్తున్నారు. జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో విద్యాలయాలను పర్యవేక్షించలేని పరిస్థితి ఉంది. దీంతో ఆశించిన స్థాయిలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టే అవకాశం లేకుండా పోయింది. పాడేరు డివిజన్‌ పరిధిలోని 11 మండలాలు విశాఖపట్నం ఆర్‌జేడీ పరిధిలో ఉండగా, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 11 మండలాలు రాజమండ్రి ఆర్‌జేడీ పరిధిలో ఉన్నాయి. దీంతో ప్రాంతీయ, జిల్లా స్థాయిలో సైతం విద్యాలయాలపై పర్యవేక్షణ కొరవడింది. మండల విద్యాశాఖాధికారుల కొరతతో ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలకే ఆయా బాధ్యతలను అప్పగిస్తుండడంతో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేని పరిస్థితి కొనసాగుతున్నది. గిరిజన సంక్షేమ విద్యాశాఖలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు సూపర్‌- 50 పేరిట ఎంపిక చేసిన 50 మంది గిరిజన విద్యార్థులు చక్కని మార్కులతో పాస్‌కాగా, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, కేజీబీవీల్లో, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ఆయా విద్యాలయాల్లో బోధన సరిగా లేకపోవడమే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో రాష్ట్రంలో అల్లూరి జిల్లా ఆఖరి స్థానానికి దిగజారింది.

జిల్లాలో వివిధ స్కూళ్లలో టెన్త్‌ విద్యార్థుల పాస్‌, ఫెయిల్‌ వివరాలు

-----------------------------------------------------------------------------------

మొత్తం పాఠశాలలు మొత్తం విద్యార్థులు ఫెయిల్‌, పాస్‌ శాతం

-----------------------------------------------------------------------------------

16 గురుకులాలు 1,272 423 849 67 శాతం

13 ప్రభుత్వ ఉన్నత 483 297 188 39 శాతం

19 కేజీబీవీలు 698 411 287 41 శాతం

18 ప్రైవేటు స్కూళ్లు 469 103 366 78 శాతం

161 టీడబ్ల్యూ ఆశ్రమాలు 7,346 4,191 3,155 43 శాతం

31 జడ్పీ స్కూళ్లు 1,168 551 617 53 శాతం

-----------------------------------------------------------------------------------

258 స్కూళ్లు 11,472 6,007 5,465 48 శాతం

-----------------------------------------------------------------------------------

Updated Date - Apr 24 , 2025 | 01:06 AM