Share News

గమ్యం చేరే దాకా టెన్షనే!

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:38 AM

విశాఖపట్నం- భద్రాచలం ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే నరకప్రాయంగా మారింది. ఎక్కడ ఆగిపోతుందో?, గమ్యానికి సురక్షితంగా చేరగలమా? అనే సందేహం ప్రయాణికులను నిత్యం వేధిస్తుంటుంది. పీటీడీ యాజమాన్యం కండీషన్‌లో లేని బస్సులను ఈ మార్గంలో నడుపుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గమ్యం చేరే దాకా టెన్షనే!
సాంకేతిక సమస్య వచ్చి సోమవారం రాత్రి మొరాయించిన విశాఖపట్నం- భద్రాచలం ఆర్టీసీ నైట్‌ సర్వీస్‌ బస్సు

- విశాఖపట్నం- భద్రాచలం ఆర్టీసీ బస్సు ప్రయాణం నిత్యం నరకం

- కండీషన్‌లో లేని బస్సులను నడుపుతుండడంతో తరచూ మొరాయింపు

- ఘాట్‌ ఎక్కలేక ఆపసోపాలు

- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

సీలేరు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం- భద్రాచలం ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటే నరకప్రాయంగా మారింది. ఎక్కడ ఆగిపోతుందో?, గమ్యానికి సురక్షితంగా చేరగలమా? అనే సందేహం ప్రయాణికులను నిత్యం వేధిస్తుంటుంది. పీటీడీ యాజమాన్యం కండీషన్‌లో లేని బస్సులను ఈ మార్గంలో నడుపుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ డిపోనకు చెందిన విశాఖపట్నం- భద్రాచలం వయా సీలేరు మీదుగా నడిపే బస్సు వాస్తవానికి రోజూ విశాఖపట్నంలో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి నర్సీపట్నం చింతపల్లి, సీలేరు, మోతుగూడెం, చింతూరు మీదుగా భద్రాచలానికి మర్నాడు ఉదయం 6.30 గంటలకు చేరుతుంది. అయితే సోమవారం రాత్రి 7.30 గంటలకు ఆర్టీసీ ఆల్ర్టా డీలక్స్‌ బస్సు విశాఖపట్నంలో బయలు దేరింది. ఈ బస్సు విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు బాగానే వచ్చిందని, అక్కడ నుంచి లంబసింగి ఘాట్‌ ఎక్కడానికి బస్సుకు పికప్‌ లేకపోవడంతో చాలా నెమ్మదిగా వెళ్లిందని ప్రయాణికులు తెలిపారు. అలాగే ధారకొండ ఘాట్‌కి వచ్చేసరికి ఎయిర్‌ వ్యాక్యూమ్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, ఘాట్‌ దిగడం కూడా చాలా నెమ్మదిగా వెళ్లిందని, తాము సురక్షితంగా గమ్యస్థానాలకు చేరతామో?, లేదో? అన్న భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించామని మోతుగూడేనికి చెందిన ప్రయాణికులు తెలిపారు. రాత్రి 3 గంటలకు మోతుగూడెం చేరాల్సిన ఈ బస్సు ఉదయం 8 గంటలకు చేరిందని వారు వాపోయారు. ఘాట్‌ రోడ్డులో ఇటువంటి కండీషన్‌లో లేని డొక్కు బస్సులను వేసి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, కనీసం బస్సులో సీట్లు కూడా కూర్చోడానికి సౌకర్యంగా లేవని మోతిగూడేనికి చెందిన 12 మంది ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి భద్రాచలం, సీలేరు వంటి ఘాట్‌ రోడ్లకు కండీషన్‌లో ఉన్న బస్సులను నడపాలని ప్రయాణికులు, ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:38 AM