తట్టబందలో ఉద్రిక్తత
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:10 AM
మండలంలోని తట్టబంద పంచాయతీ విభజన అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారు రెండు వర్గాలు విడిపోయారు. పంచాయతీని యథావిధిగా కొనసాగించాలని ఎంపీటీసీ సభ్యుడు, మాజీ ఉప సర్పంచ్ డిమాండ్ చేయగా, పంచాయతీని విభజించాల్సిందేనని ప్రస్తుత సర్పంచ్, ఆయన వర్గీయులు పట్టుబట్టారు. దీంతో మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. అరుపులు కేకలతో కుర్చీలు విసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
పంచాయతీ విభజనపై రగడ
రెండు వర్గాలు చీలిపోయిన టీడీపీ శ్రేణులు
పంచాయతీని విభజించాలని సర్పంచ్, అతని మద్దతుదారులు డిమాండ్
యథావిధిగా కొనసాగించాలని ఎంపీటీసీ సభ్యుని వర్గీయులు
ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట
గ్రామసభను వాయిదా వేసి వెళ్లిపోయిన అధికారులు
రావికమతం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తట్టబంద పంచాయతీ విభజన అంశంపై తెలుగుదేశం పార్టీకి చెందిన వారు రెండు వర్గాలు విడిపోయారు. పంచాయతీని యథావిధిగా కొనసాగించాలని ఎంపీటీసీ సభ్యుడు, మాజీ ఉప సర్పంచ్ డిమాండ్ చేయగా, పంచాయతీని విభజించాల్సిందేనని ప్రస్తుత సర్పంచ్, ఆయన వర్గీయులు పట్టుబట్టారు. దీంతో మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. అరుపులు కేకలతో కుర్చీలు విసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
తట్టబంద పంచాయతీలో ప్రస్తుతం ఏడు శివారు గ్రామాల ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పరిపాలన సౌలభ్యం కోసం పంచాయతీలను విడదీసి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దీంతో పంచాయతీల విభజనపై వచ్చిన ఆర్జీలను పరిశీలించి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తట్టబంద పంచాయతీ విభజనపై మంగళవారం పంచాయతీ కార్యదర్శి విజయ సచివాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ నుంచి బూరుగుపాలెం, పొర్లుపాలెం, కశిరెడ్డిపాలెం, ఎల్‌ఎన్ పురం గ్రామాలను వేరుచేసి, ఎన్‌ఎన్‌పురం కేంద్రంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలని టీడీపీకి చెందిన సర్పంచ్ గోకివాడ రమణ, ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. అయితే పంచాయతీని విడదీయడానికి వీలులేదని అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు పిల్లా శేషుబాబు, మాజీ ఉపసర్పంచ్ సింబోతు నాయుడు, వీరి వర్గీయులు పట్టుబట్టారు. ఇదే సమయంలో పంచాయతీకి చెందిన పలువురి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందించారు. దీంతో సర్పంచ్ వర్గీయులు దూకుడు పెంచారు. పంచాయతీ పాలకవర్గం చేసిన తీర్మానం మేరకు ఎల్‌ఎన్ పురం కేంద్రంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల వారు కేకలు, అరుపులతో తోపులాటకు దిగారు. పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. అక్కడే ఉన్న ఎస్‌ఐ రఘు వర్మ, సిబ్బంది వెంటనే స్పందించి, ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో అధికారులు సభను వాయిదా వేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.