Share News

ఏయూలో ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:14 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్‌ విద్యార్థి ఒకరు గురువారం ఉదయం సకాలంలో వైద్యం అందకపోవడంతో మృతిచెందారు.

ఏయూలో ఉద్రిక్తత

  • హాస్టల్‌ విద్యార్థి మృతి

  • సకాలంలో చికిత్స అందకపోవడమే కారణమని విద్యార్థి సంఘాల ఆందోళన

  • వర్సిటీ డిస్పెన్సరీలో సమస్యలను గతంలో వీసీ దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని ఆరోపణ

  • ప్రధాన ద్వారం ఎదుట బైఠాయింపు

  • అనంతరం వీసీ చాంబర్‌లోకి దూసుకువెళ్లిన విద్యార్థులు

  • వైస్‌ చాన్సలర్‌కు రక్షణకు నిలిచిన ప్రొఫెసర్లు, సిబ్బంది

  • వీసీ రాజీనామా చేయాలని విద్యార్థుల డిమాండ్‌

  • నేడు బంద్‌కు పిలుపు

విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్‌ విద్యార్థి ఒకరు గురువారం ఉదయం సకాలంలో వైద్యం అందకపోవడంతో మృతిచెందారు. దీనిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పట్టించుకోని వైస్‌ చాన్సలర్‌ రాజీనామా చేయాలంటూ ఆయన ఛాంబర్‌లోకి దూసుకువెళ్లారు. ఈ తరుణంలో వీసీకి ప్రొఫెసర్లు, సిబ్బంది రక్షణగా నిలిచారు. కాగా, శుక్రవారం యూనివర్సిటీ బంద్‌ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు పిలుపునిచ్చారు.

బ్రష్‌ చేయడానికి వెళ్లి పడిపోయాడు

విజయనగరానికి చెందిన వింజమూరి వెంకట సాయి మణికంఠ (25) యూనివర్సిటీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. క్యాంపస్‌లోని శాతవాహన హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో తండ్రి శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. ఆ తరువాత మిత్రులతోను సంభాషించాడు. 7.30 గంటల ప్రాంతంలో బ్రష్‌ చేసుకోవడానికి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడ జారి పడిపోయాడు. ఊపిరి అందక గిలగిలలాడాడు. ఈ విషయం గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే యూనివర్సిటీ ఆవరణలో ఉన్న డిస్పెన్సరీకి ఫోన్‌ చేసి అంబులెన్స్‌ను రప్పించారు. అందులో డ్రైవర్‌ తప్ప సహాయక సిబ్బంది ఎవరూ లేరు. తనకు ఊపిరి ఆడడం లేదని, ఆక్సిజన్‌ పెట్టాలని మణికంఠ కోరాడు. అయితే అంబులెన్స్‌లో ఆ ఏర్పాట్లు లేకపోవడంతో అక్కడి నుంచి కింగ్‌ జార్జి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ మణికంఠకు వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు గుర్తించి, అదే విషయం మిత్రులకు తెలియజేశారు. వెంటనే ఆక్సిజన్‌ పెట్టి ఉంటే చనిపోయేవాడు కాదని తెలిపారు. వెంటనే వారు విజయనగరంలోని మణికంఠ తండ్రి శ్రీనివాసరావుకు విషయం తెలియజేసి రప్పించారు.

వీసీ కార్యాలయం ఎదుట ఆందోళన

మణికంఠ ఆక్సిజన్‌ అందకే చనిపోయాడని వైద్యులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలో సమస్యలపై వీసీ రాజశేఖర్‌కు గతంలో తాము అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని, డిస్పెనర్సీలో వైద్యం అందడం లేదని, వసతులు లేవని చెప్పామని, ఆయన పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు మణికంఠ మరణించాడని ఆరోపించారు. అంతా వర్సీటీ ప్రధాన గేటు వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఆందోళనకు దిగారు. సుమారు 18 సార్లు ఈ సమస్య వీసీ దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన పట్టించుకోలేదని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. మరణించిన మణికంఠ కుటుంబానికి న్యాయం చేయాలని, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కోరారు. వీసీ రాజశేఖర్‌ అక్కడికి వచ్చి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెళ్లిపోయారు. అయితే విద్యార్థి నాయకులు దీనికి సంతృప్తి చెందలేదు. డిస్పెర్సరీలో వైద్యం అందకపోవడానికి బాధ్యులైన వారిని సస్పెండ్‌ చేయాలని, తక్షణమే వైద్యసదుపాయాలు కల్పించాలని, వీసీ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇలా ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చి...సుమారు 50 మంది విద్యార్థులు వీసీ ఛాంబర్‌లోకి దూసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వారిని ప్రొఫెసర్లు, పోలీసులు అడ్డుకొని వీసీకి రక్షణ కల్పించారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకోని మీకు వీసీగా ఉండే అర్హత లేదని, రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు పోలీసులు మరింత మంది వచ్చి వారిని బయటకు తీసుకువచ్చారు.

కేజీహెచ్‌కు వెళ్లి వైద్యులతో వీసీ చర్చలు

మణికంఠ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయకుండా తమకు ఇవ్వాలని తండ్రి శ్రీనివాసరావు కేజీహెచ్‌ వైద్యులను కోరారు. వీసీ వచ్చి చెబితే తప్ప తాము ఏమీ చేయలేమని వైద్యులు చెప్పడంతో వారు యూనివర్సిటీకి వచ్చి వీసీని కలిశారు. కేజీహెచ్‌కు రావాలని కోరారు. పోలీసుల సాయంతో వీసీ కేజీహెచ్‌కు వెళ్లి చర్చలు జరిపారు. మణికంఠ మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని, దానికి ఎవరూ బాధ్యులు కారని రాతపూర్వకంగా ఇస్తే పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని ఇస్తామని వైద్యులు చెప్పడంతో తండ్రి శ్రీనివాసరావు అక్కడికక్కడే ఆ విధంగా లేఖ రాసి కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణికి ఇచ్చారు. దీనిపై మూడో పట్టణ పోలీసులు కూడా ఓ లేఖ ఇవ్వడంతో వైద్యులు మృతదేహాన్ని ఇవ్వడానికి రాత్రి ఏడు గంటలకు అంగీకరించారు.

కొవ్వొత్తులతో నివాళి

వీసీ రాజశేఖర్‌ కేజీహెచ్‌కు వెళ్లిన తరువాత కూడా విద్యార్థులు ఏయూలో ఆందోళన కొనసాగించారు. రాత్రి ఏడు గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏయూ ప్రొఫెసర్లు వారితో చర్చించారు. డిస్పెన్సరీలో తక్షణమే వసతులు కల్పిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే వీసీ రాజీనామా చేయాల్సిందేనని విద్యార్థులు పట్టుబట్టారు. దీనిపై ఆరోగ్య శాఖ మంత్రికి, డిప్యూటీ సీఎంకు, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. రాత్రి 7,30 గంటకు ఆందోళన విరమించారు.


అంపశయ్యపై ఏయూ హెల్త్‌ సెంటర్‌

ఉన్నది ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్సు

గతంలో నలుగురు డాక్టర్లు, నలుగురు నర్సులు...

ప్రస్తుతం రిటైరైన డాక్టర్‌తోనే కాలక్షేపం

కనీస సౌకర్యాలు మృగ్యం

ఇదీ ఏయూ హెల్త్‌ సెంటర్‌ దుస్థితి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇటీవల తరచూ వివాదాల్లోకి ఎక్కుతోంది. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడమే అందుకు కారణంగా మారుతోంది. ప్రస్తుతానికి వస్తే...గురువారం ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయం హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థి ఒకరు మృతిచెందారు. యూనివర్సిటీకి చెందిన హెల్త్‌ సెంటర్‌లో కనీస సదుపాయాలు లేకపోవడం వల్లనే విద్యార్థి మృతిచెందాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

యూనివర్సిటీ హెల్త్‌ సెంటర్‌

యూనివర్సిటీలో దాదాపు 20 వేల మంది విద్యార్థులు, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కలిసి మరో 2,500 మంది ఉంటారు. వీరిలో ఎవరికి ఏ అనారోగ్యం కలిగినా క్యాంపస్‌లోని హెల్త్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందే. అక్కడ ఇంతకు ముందు నలుగురు డాక్టర్లు, నలుగురు స్టాఫ్‌ నర్సులు, వార్డు బాయ్‌లు ఉండేవారు. ఇప్పుడు ఒకే ఒక డాక్టర్‌ ఉన్నారు. ఆయన కూడా పదవీ విరమణ చేయగా, కొనసాగిస్తున్నారు. స్టాఫ్‌ నర్స్‌ కూడా ఒక్కరే ఉన్నారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే అక్కడ వైద్యం అందదు. ఆస్పత్రికి అంబులెన్స్‌ ఉంది. దానికి డ్రైవర్‌ కమ్‌ వార్డ్‌ బాయ్‌గా ఒకరే పనిచేస్తున్నారు. తాను 24/7 విద్యార్థులకు అందుబాటులో ఉండాలంటే క్వార్టర్‌లో ఉండాలని, దానికి మరమ్మతులు చేయాలని డాక్టర్‌ కోరారు. ఈ మేరకు అధికారులు వీసీకి ఫైల్‌ పెడితే...రిటైరైన డాక్టర్‌ కోసం క్వార్టర్‌కు మరమ్మతులు ఎందుకంటూ పక్కనపెట్టేశారు. కనీసం సిబ్బందిని అయినా నియమించాలని ఫైల్‌ పెడితే దానిని కూడా పరిశీలించలేదు. ప్రస్తుతం ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్సు, ఒక డ్రైవర్‌తో హెల్త్‌ సెంటర్‌ నడుస్తోంది. ఇది ప్రాథమిక చికిత్స అందించేందుకే నిర్వహిస్తున్నా...అది కూడా అందడం లేదు. ఆఖరుకు ఆక్సిజన్‌ కూడా లేకుండా చేశారు.

ఇద్దరు ప్రాణాలు కాపాడుకున్నారు

పదిహేను రోజుల క్రితం ఫార్మసీకి చెందిన ఓ విద్యార్థినికి ఊపిరి అందని పరిస్థితి ఎదురైతే తోటి విద్యార్థులు హెల్త్‌ సెంటర్‌కు తీసుకువెళ్లారు. అక్కడ ఆక్సిజన్‌ లేదని తెలిసి వెంటనే విమ్స్‌కు తరలించారు. దాంతో ఆమె బతికి బయటపడింది. అదేవిధంగా పొలిటికల్‌ సైన్స్‌కు చెందిన మరో విద్యార్థిని నీరసంగా ఉందని వెళితే...జ్వరమని తేల్చి మందులు ఇచ్చారు. వారం రోజులైనా తగ్గకపోవడంతో ఆమె బయట పరీక్షలు చేయించుకోగా డెంగీ ఫీవర్‌ అని, అప్పటికే ప్లేట్‌లెట్లు పడిపోయాయని వైద్యులు తెలిపారు. దాంతో ఆమె వెంటనే చికిత్స తీసుకోవడంతో ప్రాణాలు దక్కాయి.

Updated Date - Sep 26 , 2025 | 01:14 AM