మన్యంలో టెన్షన్
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:22 PM
ప్రస్తుతం మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో రెండు ఎన్‌కౌంటర్ల ప్రభావం ఇంకా సద్దుమణగ లేదు.
మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం
భద్రత కట్టుదిట్టం
మారుమూల బస్సు సర్వీసులు రద్దు, మరికొన్ని మండల కేంద్రాలకే పరిమితం
పాడేరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో రెండు ఎన్‌కౌంటర్ల ప్రభావం ఇంకా సద్దుమణగ లేదు. ఈ తరుణంలో మంగళవారం నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన పీఎల్‌జీవో వారోత్సవాలు ప్రారంభం కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన కొనసాగుతున్నది.
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత నెల 18న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఆయన భార్య రాజే, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, మరుసటి రోజు 19న జరిగిన రెండో మారు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఎన్‌కౌంటర్లతో 13 మందిని కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు పోలీసు అధికారులపైనా దాడులు జరిగే అవకాశముందనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసు యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. జిల్లాలోని అనేక ప్రాంతాలు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచైనా మావోయిస్టులు జిల్లాలోని చొరబడి ప్రతీకార దాడులకు పాల్పడకుండా ఉండేలా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిత్యం అనుమానితులపై నిఘాతో పాటు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
మారుమూల బస్సు సర్వీసులు రద్దు
పీఎల్‌జీఏ వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారనే ఆలోచనతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను ఈ నెల 8వ తేదీ వరకు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి భద్రాచలం, సీలేరు ప్రాంతాలకు వెళ్లే బస్సులు రద్దు కాగా, పాడేరు నుంచి భద్రాచలం, జామిగూడ, కోరుకొండ, రంపచోడవరం వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఏజెన్సీలోని మంప, జామిగుడ, వేంగడ, గుంటసీమ, చీకుమద్దుల, బందమామిడి, సిరిబాల, జోలాపుట్టు, డుడుమ, దోడిపుట్టు, గోమంగి వంటి మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను ఆయా ప్రాంతాల్లోని మండల కేంద్రాలకే పరిమితం చేశారు. ఈ నెల 8న మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ వారోత్సవాలు ముగిసిన తరువాత ఆయా సర్వీసులను ఎప్పటిలాగానే కొనసాగిస్తారు.
సీలేరులో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేశారు. మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఏవోబీలో భద్రత కట్టుదిట్టం చేశారు. సీలేరు ఎస్‌ఐ ఎండీ యాసిన్ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్ బలగాలతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నిఘా పెట్టారు.