ఉక్కులో ఉద్రిక్తత
ABN , Publish Date - May 28 , 2025 | 01:07 AM
స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు మంగళవారం పరిపాలనా భవనం ముట్టడికి యత్నిం చడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చలో అడ్మిన్ బిల్డింగ్‌కు కాంట్రాక్టు కార్మికుల పిలుపు
భవనంలోకి వెళ్లేందుకు కార్మికుల యత్నం
అడ్డుకున్న పోలీసులు
ఇరువర్గాల నడుమ తోపులాట
చర్చలకు యాజమాన్యం పిలుపు
డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వెల్లడి
నేడు ప్లాంటు గేట్ల దిగ్బంధం
ఉక్కుటౌన్‌షిప్, మే 27 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటు కాంట్రాక్టు కార్మికులు మంగళవారం పరిపాలనా భవనం ముట్టడికి యత్నిం చడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో అడ్మిన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉదయం ఎనిమిది గంటలకు కాంట్రాక్టు కార్మికులు టీటీఐ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. తొమ్మిది గంటల వరకూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తరువాత అక్కడ నుంచి ర్యాలీగా పరిపాలనా భవనం వద్దకు చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు...కాంట్రాక్టు కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంట్రాక్టు కార్మికుల మధ్య తోపులాట జరిగింది. శాంతియుతంగా నిరసన తెలుపుకోవాలని, పోలీసులతో గొడవ మంచిది కాదని కార్మిక సంఘ నాయకులకు సౌత్ ఏసీపీ టి.త్రినాఽథ్ సర్దిచెప్పారు. దీంతో కార్మికులు పరిపాలనా భవనం ముందు బైఠాయించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తమ ఆందోళన కొనసాగించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మిక నాయకులను యాజమాన్యం చర్యలకు పిలవాలని డిమాండ్ చేశారు.
కార్మిక సంఘ నాయకులు సమావేశం...
ప్లాంటు ప్రధాన పరిపాలనా భవనం ముందు కాంట్రాక్టు కార్మికులు బైఠాయించడంతో నాయకులను యాజమాన్యం చర్చలకు పిలిచింది. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటే తక్షణమే సమ్మె విరమిస్తామని కార్మిక నాయకులు తెలిపారు. దీనికి అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పారని, కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదని కార్మిక నాయకులు చెప్పారు. యాజమాన్యం దిగివచ్చేంత వరకు పోరాటాలు చేస్తామని కార్మిక నాయకులు పేర్కొన్నారు.
నేడు ప్లాంట్ గేట్ల దిగ్బంధం
యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బుధవారం ప్లాంటు గేట్ల దిగ్భందానికి కాంట్రాక్టు కార్మిక నాయకులు పిలుపునిచ్చారు. ప్లాంటు ప్రధానగేటు, విస్తరణ గేటు, బీసీ గేటు, లేబర్ గేట్లను దిగ్బంధిస్తామని ప్రకటించారు. కార్మిక వర్గం నిరవధిక సమ్మెలో పాల్గొనాలని కోరారు.