ఏవోబీలో ఉద్రిక్తత
ABN , Publish Date - May 21 , 2025 | 11:37 PM
ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆపరేషన్ కగారులో భాగంగా బుధవారం ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందడం కలకలం రేపింది.
ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు
కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కేశవరావు మృతి
మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరిక
అప్రమత్తమైన పోలీసు అధికారులు
సరిహద్దు ప్రాంతాల్లో వాహన తనిఖీలు
కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక బలగాలు
చింతపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆపరేషన్ కగారులో భాగంగా బుధవారం ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందడం కలకలం రేపింది. ఇందులో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడం సంచలనమైంది. ఆయనపై రూ.1.5 కోట్ల రివార్డు ఉంది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత మరణించడంతో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బలగాలతో సరిహద్దు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తూనే మరోవైపు ప్రధాన కేంద్రాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ నిర్మూలన లక్ష్యంగా ఆపరేషన్ కగారు నిర్వహిస్తున్నది. దీంతో మావోయిస్టు పార్టీకి సురక్షిత ప్రాంతంగా పేరొందిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వరుస ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. వందల మంది మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. ఇదే సమయంలో సీపీఐ మావోయిస్టు అగ్రనేతలు ఏవోబీ సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించారు. పార్టీని బలోపేతం చేసేందుకు రెండు నెలల క్రితం మావోయిస్టులు ఏవోబీ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించినట్టు పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ఈ నెల 7వ తేదీన వై.రామవరం మండలం శేషరాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏవోబీ ఎస్‌జెడ్‌సీ సభ్యుడు జగన్ అలియాస్ కాకూరి పండన్న, ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఏవోబీ ఎస్‌జెడ్‌సీ సభ్యుడు రమేశ్ మృతి చెందారు. జగన్ మృతి మావోయిస్టు పార్టీకి తీరనిలోటని చెప్పాలి. బుధవారం మావోయిస్టు పార్టీ అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందడం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఆంధ్రలోనూ చర్చనీయాంశంగా మారింది.
పీఎల్‌జీఏ సృష్టికర్త
గెరిల్లా దాడులపై అపార అనుభవం కలిగిన కేశవరావు 2000 డిసెంబరు 2న ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) నిర్మాణానికి ప్రధాన భూమిక పోషించారు. 2004 సెప్టెంబరు 21లో పీపుల్‌వార్ గ్రూప్(పీడబ్ల్యూజీ)ని మావోయిస్టు పార్టీలో విలీనం చేసిన సమయంలో కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టి, క్రియాశీలక పాత్ర పోషించారు. పీఎల్‌జీఏ దళాలు పదేళ్లపాటు తూర్పుకనుముల్లో పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. తూర్పుకనుముల్లో కేశవరావు సూచనలతో పలు మెరుపుదాడులు నిర్వహించాయి. పోలీసు స్టేషన్లపై దాడులు నిర్వహించాయి. 2018 సెప్టెంబరు 23న అప్పటి అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హతమార్చిన ఘటనకు సూత్రధారిగా వ్యవహరించినట్టు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది.
అడవులు జల్లెడ
మావోయిస్టుల అణిచివేతకు పోలీసులు అడవులు జల్లెడ పడుతున్నారు. 15 రోజుల క్రితం ఎదురుకాల్పుల్లో మావోయిస్టు ఎస్‌జెడ్‌సీ సభ్యుడు జగన్, తాజాగా మావోయిస్టు పార్టీ అగ్రనేత కేశవరావు మృతితో మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని పోలీసు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు సరిహద్దు ప్రాంతాలకు అదనపు బలగాలను పంపించారు. సీపీఐ మావోయిస్టు పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పోలీసు బలగాలు సరిహద్దు అడవులను గాలిస్తున్నాయి. ప్రధానంగా రంపచోడవరం, చింతూరు, పాడేరు డివిజన్ల సరిహద్దు అడవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ప్రధాన గ్రామాల్లో 24 గంటలు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొంతకాలంగా సరిహద్దు గిరిజన గ్రామాలు పోలీసులు, మావోయిస్టుల బూట్ల శబ్ధంతో దద్దరిల్లుతున్నాయి. ఆదివాసీలు ఏ క్షణంలో ఎటువంటి హింసాత్మక సంఘటన చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు.
పోలీసులు అప్రమత్తం
సీలేరు: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ నేపథ్యం ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. సీలేరు, జీకేవీధి, చిత్రకొండ, డొంకరాయి, చింతూరు, మోతుగూడెం తదితర ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.