సీసీఎస్ నిర్వహణకు టెండర్లు
ABN , Publish Date - Nov 17 , 2025 | 01:45 AM
నగరంలో పర్యావరణహితంగా చెత్త నిర్వహణకు వివిధ జోన్లలో ఏర్పాటుచేసిన క్లోజ్డ్ కాంపెక్టర్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టుల వార్షిక నిర్వహణకు జీవీఎంసీ అధికారు లు టెండర్లు పిలిచారు.
నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించిన జీవీఎంసీ
పనుల్లో విఫలమైన కాంట్రాక్టర్‌పై చర్యలకు మీనమేషాలు
జీవీఎంసీ కమిషనర్ ఆదేశించినా స్పందన నిల్
రూ.56 లక్షల రికవరీపైనా ఉదాశీనత
తాజా టెండర్లలో పాల్గొనేలా సహకరిస్తున్న అధికారులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో పర్యావరణహితంగా చెత్త నిర్వహణకు వివిధ జోన్లలో ఏర్పాటుచేసిన క్లోజ్డ్ కాంపెక్టర్ సిస్టం (సీసీఎస్) ప్రాజెక్టుల వార్షిక నిర్వహణకు జీవీఎంసీ అధికారు లు టెండర్లు పిలిచారు. జీవీఎంసీ పరిధిలోని నాలుగు జోన్లలో సీసీఎస్ ప్రాజెక్టులకు వేర్వుగా టెండర్లు ఆహ్వా నించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల నిర్వహణలో నిబంధనలను అతిక్రమించినట్టు జీవీఎంసీ కమిషనర్ నిర్ధారించి చర్యలకు ఆదేశించిన కాంట్రాక్టర్‌కు టెండరులో పాల్గొనే అర్హతపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది.
జీవీఎంసీ పరిధిలో చెత్తను జోన్లలో ఏర్పాటుచేసిన గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్స్ (డంపింగ్‌స్టేషన్)కు క్లాప్‌వాహనాలు, డంపర్‌బిన్ల ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు చేరుస్తారు. డంపింగ్‌స్టేషన్ల నుంచి కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు ఓపెన్ టిప్పర్లు, లారీల్లో తరలిస్తే దుర్గంధంతో పాటు చెత్త ఎగిరి వాహనచోదకులు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు, ఖాళీస్థలాల్లో పడుతోంది. ఫలితంగా రోడ్లపై చెత్త పేరుకుపోయి పారిశుధ్యలోపం, పర్యావరణ దెబ్బతింటున్నాయి.
హూపర్లతో తరలింపు
ఈ నేపథ్యంలో జీవీఎంసీ భీమిలి, ముడసర్లోవ, టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక, చీమలాపల్లిలో సీసీఎస్ ప్రాజెక్టులను ఏర్పాటుచేసింది. క్లాప్‌వాహనాలు, డంపర్‌బిన్లతో వచ్చిన చెత్తను గల్లా మాదిరిగా ఉండే హూపర్‌లో వేస్తే ప్రత్యేక యంత్రాలు చెత్తను కంప్రెస్‌చేసి కంటెయినర్ (హుక్‌లోడర్)లోకి పంపుతుంది. దానిని లారీలో కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. దీనివల్ల ఒకేసారి ఎక్కువమొత్తంలో చెత్తను తరలించే వీలుంటుంది. చెత్తతరలించేందుకు హుక్‌లోడర్లు, డీజిల్‌ను జీవీఎంసీ సమకూర్చుతుండగా, డ్రైవర్లు, ప్రాజెక్టు నిర్వహణకు సిబ్బంది, మరమ్మతుల బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. గత ఏడాది ముడసర్లోవ, గాజువాక, టౌన్‌కొత్తరోడ్డు సీసీఎస్ ప్రాజెక్టులను టెండరు ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్నది.
అధికారుల నిర్లక్ష్యం
ఈ ప్రాజెక్టుల నిర్వహణపై ఇంజనీరింగ్ అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడంతో కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. విభాగాల నిర్వహణకు జీవీఎంసీ డబ్బు చెల్లిస్తున్నప్పటికీ ఒకసారి పరికరం పాడైపోతే కొత్తది ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల హూపర్ పనిచేయకపోవడంతో చెత్తను రాత్రివేళ ఓపెన్‌టిప్పర్లతో కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించి నిర్వహణ నిధులు మిగుల్చుకుంటున్నారు. క్లాప్‌వాహనాల ద్వారా అంచనాకు మించి చెత్త వస్తుండడంతో డంపింగ్‌స్టేషన్‌లో చెత్త పేరుకుపోతోందని, అద్దెకు తీసుకున్న అదనపు లారీలతో చెత్తను తరలించి, నిధులు డ్రా చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ రెండు నెలల కిందట టౌన్‌కొత్తరోడ్డు, గాజువాక సీసీఎస్ ప్రాజెక్టులను తనిఖీ చేశారు. టౌన్‌కొత్తరోడ్డు వద్ద ఒక హూపర్ పనిచేయడం లేదని, ఓపెన్‌టిప్పర్లతో చెత్తను రాత్రిపూట తరలిస్తున్నట్టు గుర్తించారు. గాజువాకలో హుక్‌లోడర్ ఏడాది కిందట రోడ్డుప్రమాదానికి గురైతే ఆ వాహనం తిరుగుతున్నట్టు చూపించి డీజిల్ తీసుకుంటున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో రెండు సీసీఎస్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ నుంచి రూ.56 లక్షలు రికవరీ చేసి, బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించారు.
నోటీసులతో సరి
అయితే మెకానికల్ అధికారులు కాంట్రాక్టర్‌కు టెర్మినేషన్ నోటీసు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. కమిషనర్ ఆదేశించి రెండునెలలు గడుస్తున్నా ఇంతవరకు రూ.56 లక్షలు రికవరీ చేయలేదు. తాజాగా సీసీఎస్ ప్రాజెక్టుల నిర్వహణకు సుమారు రూ.ఏడు కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవడంతో సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటే టెండర్లకు అర్హత కోల్పోతాడు. చర్యలపై తాత్సారం చేస్తే టెండర్‌లో పాల్గొనే వీలుంటుందని, ఇందుకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టిసారించి నిబంధనలు అతిక్రమించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు.