జలపాతాలు తాత్కాలిక మూసివేత
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:35 PM
ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జలపాతాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
గెడ్డలు ఆకస్మికంగా పొంగడంతో చిక్కుకుంటున్న పర్యాటకులు
తాజాగా సరియా వద్ద చిక్కుకున్న31 మంది పర్యాటకులు
ఐదు గంటలు శ్రమించి బయటకు తెచ్చిన పోలీసులు
ప్రజలను అప్రమత్తం చేస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు
అనంతగిరి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాల వద్దకు వెళ్లే క్రమంలో గెడ్డలు దాటుతూ గిరిజనులు, పర్యాటకులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జలపాతాల సౌందర్యాన్ని చూడడానికి వెళ్లిన పర్యాటకులు ఆకస్మికంగా గెడ్డలు పొంగుతుండడంతో ఆవలి వైపు చిక్కుకుంటున్నారు. కొంతమంది గిరిజనులు ఇంటికీ చేరాలనే ఆతృతతో పొంగుతున్న గెడ్డలు దాటేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ కుటుంబానికి శోకాన్ని మిగులుస్తున్నారు. ఇలా గెడ్డలను దాటే క్రమంలో గత ఏడాది ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జలపాతాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా గెడ్డలను దాటవద్దంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
‘సరియా’ వద్ద రెండు సార్లు చిక్కుకున్న పర్యాటకులు
మండలంలోని సరియా జలపాతం వద్ద రెండు నెలల క్రితం పర్యాటకులు చిక్కుకున్నారు. జలపాతం అందాలను తిలకించేందుకు వెళ్లగా ఆకస్మికంగా గెడ్డ పొంగడంతో పది మంది పర్యాటకులు ఉండిపోయారు. దీంతో స్థానికులు వారిని జాగ్రత్తగా గెడ్డ దాటించడంతో బయటపడ్డారు. తాజాగా ఈనెల 12వ తేదీన మంగళవారం సరియా జలపాతాన్ని తిలకించేందుకు గెడ్డ అవతలి వైపు వెళ్లగా.. ఎగువన పడిన భారీ వర్షానికి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో 31 మంది పర్యాటకులు ఆవలి వైపు ఉండిపోయారు. పోలీస్ శాఖ అప్రమత్తం కావడంతో ఐదు గంటలు శ్రమించి 31 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం జలపాతాన్ని మూసివేశారు. పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. వలంటీర్లను అప్రమత్తం చేసి, జలపాతాలకు ఎవరికి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
మిచాంగ్ తుఫాన్‌లో ముగ్గురు మృతి
2023లోని మిచాంగ్ తుఫాన్ సమయంలో భీంపోల్ పంచాయతీలో గల లువ్వా గెడ్డకు భారీగా వరద నీరు పోటెత్తింది. కాజ్‌వే పైనుంచి దాటే క్రమంలోని సీతపాడు గ్రామానికి చెందిన గెమ్మల లక్ష్మి, గెమ్మెల కుమార్, మిరియాల కమల గల్లంతై మృత్యువాత పడ్డారు. అదే ఏడాది నాలుగు రోజుల వ్యవధిలో పెదబయలు మండలంలోని పెదకొడాపల్లి పంచాయతీ పరదానిపుట్టు గ్రామానికి చెందిన కిల్లో రామకృష్ణ మత్స్యగెడ్డలో చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడ్డాడు.
జలపాతాలను మూసివేశాం
వీరభద్రచారి, తహశీల్దార్, అనంతగిరి
మండలంలోని సరియా, కటికి, తాటిగుడ జలపాతాలు మూసి వేస్తూ ఆదేశాలు జారీ చేశాం. ఆయా గ్రామాల వీఆర్‌వోలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకులకు అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించాం. వరద ఉధృతి తగే ్గవరకు జలపాతాలకు అనుమతించం.
జలపాతాల వద్దకు వెళ్లొద్దు
డీ శ్రీనివాసరావు, ఎస్‌ఐ, అనంతగిరి
వర్షకాలంలో జలపాతాలు కనువిందు చేస్తాయనే ఆలోచనతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. గెడ్డలు ఆకస్మికంగా పొంగడంతో జలపాతాల వద్దకు వచ్చిన పర్యాటకులు చిక్కుకుంటున్నారు. అందువల్ల వర్షాకాలంలో జలపాతాల వద్దకు పర్యాటకులు రావద్దు. జలపాతాలను మూసివేశాం. గెడ్డలను దాటే ప్రయత్నాలు, చేపల వేటకు వెళ్లవద్దని గిరిజనులకు అవగాహన కల్పించాం.