జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సులకు తాత్కాలిక బ్రేక్
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:13 AM
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద కొనుగోలు చేసిన 18 బస్సులకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది.
బస్సు దగ్ధం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలు
అన్నీ స్టీల్‌సిటీ డిపోనకు తరలింపు
బస్సుల కండిషన్‌ను
పరిశీలించిన సీనియర్ అధికారులు
ద్వారకా బస్‌స్టేషన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం) కింద కొనుగోలు చేసిన 18 బస్సులకు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. వీటిని స్టీల్ సిటీ డిపోలో నిలిపివేశారు. ఈ డిపో నుంచి విజయనగరం వెళుతున్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం మెట్రో ఎక్స్‌ప్రెస్ శుక్రవారం జాతీయ రహదారిపై శాంతిపురం జంక్షన్ వద్ద షార్ట్‌సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ విషయం నగరంలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులను విచారించారు. రీజియన్‌లో ఉన్న అలాంటి బస్సులన్నీ వెంటనే నిలిపివేయాలని, సాంకేతికతను పరిశీలించిన తరువాత మాత్రమే రవాణా సేవలకు వినియోగించాలని ఆదేశించారు. దీంతో ఈ బస్సులన్నింటినీ శుక్రవారం మధ్యాహ్నం స్టీల్ సిటీ డిపోనకు తరలించారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు 2015-17 మధ్య నాలుగు దశల్లో 18 బస్సులు వచ్చాయి. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వీటిని సమకూర్చింది. వీటి కొనుగోలు ఖర్చులో 50 శాతం కేంద్రం భరించగా, మిగిలిన మొత్తం ఆర్టీసీ చెల్లించింది. ఈ బస్సులు హైవే రన్నింగ్‌కు బాగుంటాయని అప్పటి అధికారులు స్టీల్‌సిటీ డిపోనకు కేటాయించారు. ఇందులో 16 బస్సులను విజయనగరం, రెండు బస్సులు ద్వారకా బస్‌స్టేషన్ నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్ రూట్లలో నడుపుతున్నారు.
నిపుణుల పరిశీలన
నగరంలో శుక్రవారం ఒక బస్సు దగ్ధమైన నేపథ్యంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల సాంకేతికతను మెకానికల్ ఇంజనీర్ల బృందం శనివారం పరిశీలించింది. విజయవాడ నుంచి వచ్చిన ఆర్టీసీ సీనియర్ మెకానికల్ ఇంజనీర్లు శర్మ, మాధవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మెకానికల్) బ్రహ్మానందరెడ్డిలు శాంతిపురం జంక్షన్‌లో శుక్రవారం దగ్ధమైన బస్సును, స్టీల్‌సిటీ డిపోలో నిలిపి ఉంచిన బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు. వీరికి విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ పద్మావతి, మెకానికల్ ఫోర్‌మన్, ఇద్దరు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్లు బస్సుల పనితీరును వివరించారు.