బల్క్‌డ్రగ్‌పై ఆందోళనకు తాత్కాలిక బ్రేక్
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:26 AM
బల్క్‌డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ధర్నాకు తాత్కాలిక బ్రేక్ పడింది.
హోం మంత్రి అనితను కలిసిన మత్స్యకారులు
సీఎం వద్దకు తీసుకువెళతానని మంత్రి హామీ
ధర్నా విరమిస్తున్నట్టు తహశీల్దార్‌కు లేఖ అందజేసిన గ్రామస్థులు
నక్కపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బల్క్‌డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ధర్నాకు తాత్కాలిక బ్రేక్ పడింది. సోమవారం నక్కపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద హోం మంత్రి వంగలపూడి అనితను పార్టీలకతీతంగా రాజయ్యపేట మత్స్యకారులు, నాయకులు కలిశారు. బల్క్‌డ్రగ్ పార్కును రద్దు చేయాలంటూ గత 71 రోజులుగా మత్స్యకారులు టెంట్ ఏర్పాటు చేసిన ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ సమస్యపై సీఎం చంద్రబాబుతో చర్చించాలంటే ముందుగా కొన్ని రోజులు టెంట్‌లో ధర్నాను విరమించాలని హోం మంత్రి కోరారు. బల్క్‌డ్రగ్ పార్కును రద్దు చేస్తే ఆందోళన విరమిస్తామని మత్స్యకారులు చెప్పారు. ధర్నా విరమిస్తే తాను సీఎంను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకుంటానని హోం మంత్రి హామీ ఇచ్చారు. దీనిపై మత్స్యకారులు, నాయకులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నుంచి బల్క్‌డ్రగ్ పార్కు రద్దు చేస్తామనే ప్రకటన రాకపోతే మళ్లీ యథావిధిగా టెంట్ ఏర్పాటు చేసి, శాంతియుత ధర్నా కొనసాగిస్తామని చెప్పారు. అనంతరం రాజయ్యపేటలో వున్న నిరసన శిబిరం వద్దకు వెళ్లి అక్కడున్న వారికి విషయం చెప్పారు. హోం మంత్రి అనిత సూచనల మేరకు తాత్కాలికంగా తాము టెంట్‌లో ధర్నా చేయడాన్ని విరమించాలని ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నామంటూ తహశీల్దార్ నర్సింహమూర్తికి గ్రామస్థులు లేఖ అందజేశారు. ఇందులో జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, పి.కోదండరావు, పిక్కితాతీలు, మహేశ్‌బాబు, సోమేశ్వరరావు, పిక్కిస్వామి, గంగరాజు, కాశీరావు, నాగేశ్,కారే వెంకటేశ్, నూకమ్మ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.