Share News

గుడి... వెనుకబడి

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:19 AM

జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో సేవలపై భక్తులు సంతృప్తికరంగా లేరు.

గుడి... వెనుకబడి

ఈ ఏడాది జూన్‌ నుంచి భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న ప్రభుత్వం

ర్యాకింగ్‌లో వెనుకబడిన మన ఆలయాలు

ఐదో స్థానంలో సింహాచలం దేవస్థానం, ఏడో స్థానంలో కనకమహాలక్ష్మి ఆలయం

సదుపాయాలపై భక్తుల అసంతృప్తి

సింహాచలంలో ప్రసాదం రుచిగా లేదని ఫిర్యాదులు

కనకమహాలక్ష్మి ఆలయంలో పారిశుధ్యలోపం

తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సీఎస్‌ ఆదేశం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో సేవలపై భక్తులు సంతృప్తికరంగా లేరు. కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సవరించుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల నుంచి తీసుకున్న అభిప్రాయాల ప్రకారం ఇచ్చిన ర్యాంకింగ్‌లో జిల్లాలోని ప్రధాన దేవాలయాలు రెండూ వెనుకబడి ఉన్నాయి. సింహాచలం దేవస్థానం 5వ స్థానంలో ఉండగా, కనకమహాలక్ష్మి దేవస్థానం 7వ స్థానంలో ఉంది. వీటిపై చీఫ్‌ సెక్రటరీ విజయానంద్‌ గురువారం సమీక్షించారు. ఆ రెండు ఆలయాల్లో భక్తులకు మరింత మెరుగైన వసతులు లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు సూచించారు. సింహాచలం దేవస్థానానికి కొత్త ఈఓ వచ్చారని, సర్దుకుంటున్నారని, కనకమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి మరిన్ని చర్యలు చేపడతామని కలెక్టర్‌ సమాధానం ఇచ్చారు.

సర్వే ఎలా చేశారంటే...?

రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో భక్తులకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సూచిస్తోంది. దీనిపై ప్రజల నుంచి గత ఏడాది జూన్‌ నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటోంది. దర్శనం సంతృప్తిగా జరిగిందా?, తాగునీరు, ఇతర మౌలిక వసతులు బాగున్నాయా?, ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా?, ఆలయ ప్రాంగణాల్లో పారిశుధ్యం ఎలా ఉంది?...అనే అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటోంది. జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి కలిగిన ఆలయాలను ఒక విభాగంలో, డిప్యూటీ కమిషనర్‌ స్థాయి కలిగిన ఆలయాలను మరో విభాగంలో చేర్చింది. ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, విజయవాడ కనకదుర్గ గుడి మొదటి విభాగంలో ఉన్నాయి. ఈ ఏడు ఆలయాలకు భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాల ప్రకారం ర్యాంకింగ్‌ ఇవ్వగా సింహాచలం ఐదో స్థానంలో నిలిచింది. ప్రసాదం తాజాగా, రుచిగా లేదని తెలియడంతో ఆరు ర్యాంక్‌ వచ్చింది. తాగునీరు, మౌలిక వసతులు, పారిశుధ్యం విషయంలో 5వ ర్యాంకు, దర్శనాల్లో 4వ ర్యాంకు వచ్చింది. దీంతో సింహాచలంలో ప్రసాదం నాణ్యత పెంచాలని, వసతులు మెరుగుపరచాలని సీఎస్‌ విజయానంద్‌ సూచించారు.

కనకమహాలక్ష్మి ఆలయంలో

డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారి కలిగిన ఆలయాల విభాగంలో కనకమహాలక్ష్మి ఆలయం ఉంది. రాష్ట్రంలో 14 ఆలయాలను ఈ విభాగంలో చేర్చి అభిప్రాయాలు తీసుకున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే కనకమహాలక్ష్మి ఆలయం 7వ స్థానంలో నిలిచింది. భక్తులకు దర్శనాలు కల్పించడంలోను అదే 7వ ర్యాంక్‌ వచ్చింది. తాగునీరు, వసతుల విషయంలో 6వ ర్యాంకు, ప్రసాదం రుచి, నాణ్యతలో 6, పారిశుధ్యం విషయంలో 5వ ర్యాంకు వచ్చాయి. ఈ ఆలయంలో సమన్వయలోపం ఉందని అధికారులు గుర్తించారు. తాజాగా గురువారం జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ కూడా ఇతర విభాగాల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఈఓ శోభారాణికి సూచించారు. కలెక్టర్‌ కూడా రెండుసార్లు ఆలయాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. మరింత ఫోకస్‌ పెడతామని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ గురువారం జరిగిన సమీక్షలో సీఎస్‌ విజయానంద్‌కు చెప్పారు.

Updated Date - Dec 06 , 2025 | 01:21 AM