Share News

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:33 PM

మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. దీంతో చలి తీవ్రంగా ప్రభావం చూపుతున్నది.

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
పాడేరు శివారున చలి మంట కాగుతున్న పర్యాటకులు

అరకులోయలో 8.5 డిగ్రీలు

కొనసాగుతున్న చలి తీవ్రత

పాడేరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు దిగజారుతున్నాయి. దీంతో చలి తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. గురువారం అరకులోయలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, జి.మాడుగులలో 9.3, ముంచంగిపుట్టులో 9.5, డుంబ్రిగుడలో 9.7, పెదబయలులో 10.3, హుకుంపేటలో 10.6, పాడేరులో 10.8, చింతపల్లిలో 12.6, అనంతగిరిలో 13.4, కొయ్యూరులో 14.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలికి వణుకుతున్న మన్యంవాసులు

ఏజెన్సీలో గత మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురుస్తోంది. మధ్యాహ్నం ఒక మోస్తరుగా ఎండ కాస్తున్నది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా చలి వణికిస్తోంది. దీంతో జనం ఉన్ని దుస్తులు ధరించి, మంటలు వేసుకుంటూ చలి వాతావణం నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే పర్యాటకులు మన్యానికి వచ్చి చలి వాతావారణాన్ని ఆస్వాదిస్తున్నారు.

డుంబ్రిగుడలో..

డుంబ్రిగుడ: మండలంలో చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో పాటు పొగమంచు దట్టంగా కురుస్తోంది. గురువారం ఉదయం ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలు దాటినా లైట్ల వెలుతురులో వాహనాలు రాకపోకలు సాగించాయి.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండలంలో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. గురువారం ఉదయం 10 గంటలైనా పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. జనం నిత్యం స్వెట్టర్లు ధరించి ఉంటున్నారు. బయటకు రావడానికి జంకుతున్నారు.

సీలేరులో..

సీలేరు: జీకేవీధి మండలంలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. సీలేరులో ఎన్నడూ లేనివిధంగా చలి తీవ్రత అధికంగా ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తోంది.

Updated Date - Nov 27 , 2025 | 11:33 PM