Share News

టీచర్లు లేక పాఠశాల మూసివేత

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:45 PM

జీకేవీధి మండలంలోని సీలేరు ఎంపీపీ పాఠశాల సోమవారం ఉపాధ్యాయులు రాకపోవడంతో తెరుచుకోలేదు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 80 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు.

టీచర్లు లేక పాఠశాల మూసివేత
సీలేరులో సోమవారం తెరుచుకోని ఎంపీపీ పాఠశాల

హెచ్‌ఎంకు బదిలీ

కౌన్సెలింగ్‌కు వెళ్లిన ఎంటీఎస్‌ టీచర్‌

స్కూల్‌ మూసి ఉండడంతో వెనుదిరిగిన విద్యార్థులు

సీలేరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలంలోని సీలేరు ఎంపీపీ పాఠశాల సోమవారం ఉపాధ్యాయులు రాకపోవడంతో తెరుచుకోలేదు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వెనుదిరిగారు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 80 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని, ఒక ఎంటీఎస్‌ (మినిమం టైమ్‌ స్కేల్‌) ఉపాధ్యాయిని విధులు నిర్వహిస్తున్నారు. హెచ్‌ఎం క్రాంతికుమారికి ఇటీవల నిర్వహించిన కౌన్సెలింగ్‌లో మైదాన ప్రాంతానికి బదిలీ అయింది. నిబంధనల ప్రకారం ఆమె స్థానంలో కొత్తవారు ఇక్కడ చేరిన తరువాతే ఇక్కడ నుంచి రిలీవ్‌ చేయాలి. అయితే ఆమె స్థానంలో కొత్తవారు రాకపోవడంతో రిలీవ్‌ అయి వెళ్లిపోయినట్టు సమాచారం. ఇక ఈ పాఠశాలలో ఉన్న ఎంటీఎస్‌ ఉపాధ్యాయిని సూర్యకుమారి కూడా బదిలీ కౌన్సెలింగ్‌ కోసం వెళ్లిపోయారు. దీంతో సోమవారం ఈ పాఠశాల తెరుచుకోలేదు. అయితే బొడ్డగండి పంచాయతీ మెట్టగూడ గ్రామానికి చెందిన వంతల జొయిసన్‌ తన కుమారుడిని ఇక్కడ మూడవ తరగతిలో చేర్పించేందుకు సోమవారం రాగా, పాఠశాల మూసి ఉంది. చాలా సేపు వేచి ఉండి వెనుదిరిగారు. హెచ్‌ఎం స్థానంలో కొత్తవారు రాకుండా పాత హెచ్‌ఎంను ఎలా రిలీవ్‌ చేశారని, ఉపాధ్యాయులు లేని కారణంగా పాఠశాల మూసి వేయడం విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

పెదపాడు గ్రామంలో కూడా..

డుంబ్రిగుడ: మండలంలోని పెదపాడు గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం ఉపాధ్యాయుడు లేక తెరుచుకోలేదు. ఐటీడీఏ పరిధిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో గతంలో పనిచేసిన సీఆర్‌టీలను ప్రభుత్వం రెన్యువల్‌ చేసింది. అయితే ఇప్పటికీ వారికి పాఠశాలలు కేటాయించడానికి కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు. దీంతో గతంలో సీఆర్‌టీలు పని చేసిన పాఠశాలలు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెదపాడు పాఠశాల కూడా మూతపడింది. ఈ పాఠశాలలో సుమారు 53 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై పదకొండు రోజులు అయినప్పటికీ ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఎంఈవో వెంటనే స్పందించి ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:45 PM