Share News

విద్యార్థులకు మార్గదర్శి ఉపాధ్యాయుడు

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:48 AM

విద్యార్థులను సన్మార్గంలో నడిపించే మార్గదర్శులు ఉపాధ్యాయులని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ఏయూ అంబేడ్కర్‌ అసెంబ్లీ హాలులో శుక్రవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు.

విద్యార్థులకు మార్గదర్శి ఉపాధ్యాయుడు
సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి. చిత్రంలో ఎంపీ శ్రీభరత్‌, కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ ఉన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత సాధించాలి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి

విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులను సన్మార్గంలో నడిపించే మార్గదర్శులు ఉపాధ్యాయులని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ఏయూ అంబేడ్కర్‌ అసెంబ్లీ హాలులో శుక్రవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. ఉపాధ్యాయ బదిలీల్లో పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీఎం చంద్రబాబునాయుడు రాజకీయ జోక్యాన్ని తగ్గించారన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి నారా లోకేశ్‌ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకు వస్తున్నారని, డీఎస్సీ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఉపాఽధ్యాయులకు మంచి గౌరవం ఇస్తున్నారన్నారు. విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలని కోరారు. కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌ మాట్లాడుతూ అవార్డు పొందిన టీచర్లను ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఉపాధ్యాయులు బోధన చేయాలని, ఆఖరు బెంచీలో ఉన్న విద్యార్థులు సైతం అర్థం చేసుకునేలా బోధనపై శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ కో-ఆపరేటివ్‌ ఆయిల్‌ సీడ్స్‌ గ్రోవర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ గండి బాబ్జీ, డీఈవో నిమ్మక ప్రేమ్‌కుమార్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ అడిషనల్‌ ప్రాజెక్టు కో- ఆర్డినేటర్‌ చంద్రశేఖరరావు, డిప్యూటీడీఈవో సోమేశ్వరరావు, ఎంఈవోలు, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు పాఠశాలలకు చెందిన 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రి, విప్‌, కలెక్టర్‌, తదితరులు సన్మానించి ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు.

Updated Date - Sep 06 , 2025 | 12:48 AM