Share News

ప్చ్‌...టీడీఆర్‌లా!

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:40 AM

అభివృద్ధి పనుల కోసం ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇస్తున్న ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)కు మార్కెట్‌లో పెద్దగా డిమాండ్‌ లేదు.

ప్చ్‌...టీడీఆర్‌లా!

డిమాండ్‌ శూన్యం

మార్కెట్‌లో అమ్ముకుంటే వచ్చేది 40 శాతమే

అందుకే భూములు ఇవ్వడానికి ముందుకురాని యజమానులు

బాండ్ల వల్ల ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోవాలని సూచనలు

అప్పుడు ప్రాజెక్టులకు కదలిక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అభివృద్ధి పనుల కోసం ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇస్తున్న ట్రాన్సఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)కు మార్కెట్‌లో పెద్దగా డిమాండ్‌ లేదు. వాటిని అమ్ముకుంటే అందులో కేవలం 40 శాతమే వస్తోంది. దాంతో భూములు ఇచ్చినవారు నష్టపోతున్నారు. ఈ విధానం పెద్ద లాభదాయకం కానందున చాలామంది భూములు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు.

గతంలో వైసీపీ ప్రభుత్వం టీడీఆర్‌ల పేరుతో భారీ కుంభకోణాలకు తెర తీసింది. వాస్తవానికి రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు భూములు తీసుకున్నప్పుడే టీడీఆర్‌లు ఇచ్చే విధానం అమలులో ఉంది. దానిని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం దుర్వినియోగం చేసింది. ఎక్కడైనా మార్కెట్‌ యార్డులు, ఇతర నిర్మాణాలు చేపట్టాలంటే వాటికి కూడా భూమి తీసుకొని టీడీఆర్‌లు ఇచ్చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా వైసీపీ నాయకుల వేల కోట్ల రూపాయల టీడీఆర్లు దుర్వినియోగం చేశారు. విశాఖపట్నంలో అయితే కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన రహదారులకు భూములు ఇచ్చామని టీడీఆర్‌లు కొట్టేశారు. దీంతో వాటిపై ప్రజలకు విశ్వాసం పోయింది.

మార్కెట్‌లో డిమాండ్‌ శూన్యం

ఎక్కడైనా రహదారి విస్తరణ, నిర్మాణంలో భూమిని కోల్పోతే ఆ భూమికి నాలుగింతల విస్తీర్ణంలో ఎక్కడైనా అదనపు నిర్మాణం చేసుకోవడానికి టీడీఆర్‌లు ఇస్తున్నారు. వీటిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులైన బిల్డర్లే అధికంగా కొంటారు. వ్యక్తిగత గృహాలు నిర్మించుకునే వారికి పైన మరో అంతస్థు వేసుకోవడానికి భారీ టీడీఆర్‌లు అవసరం ఉండదు. అదే బిల్డర్లు అయితే పైన మరో రెండు అంతస్థులు (ఫ్లోర్లు) వేసుకుంటే అందులో అధమంగా ఎనిమిది నుంచి పన్నెండు ఫ్లాట్లు వస్తాయి. వాటిని అమ్ముకుంటే భారీగా లాభం వస్తుంది. అందుకని వారే కొంటారు. ప్రస్తుతం అన్ని అనుమతులతో నిర్మించిన అపార్టుమెంట్లలోనే ఫ్లాట్లు అమ్ముడుపోవడం లేదు. మార్కెట్‌ డౌన్‌లో ఉంది. అందువల్ల సన్నటి రోడ్లలో అదనంగా అంతస్థులు వేస్తే వాటిని కొనడానికి ఎవరూ వచ్చే అవకాశాలు లేవు. దాంతో టీడీఆర్‌లకు డిమాండ్‌ కరవైంది. దీనిని ఆసరాగా తీసుకొని భూ యజమానుల అవసరాలను బట్టి టీడీఆర్‌ విలువలో 38 నుంచి 40 శాతం ఇచ్చి కొందరు కొంటున్నారు. అంటే రూ.50 లక్షల విలువైన టీడీఆర్‌కు రూ.20 లక్షలు నుంచి రూ.22 లక్షలు మాత్రమే వస్తోంది. దాంతో టీడీఆర్‌లు పొందినవారు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ప్రభుత్వం భూమి సేకరించినప్పుడు టీడీఆర్‌లు ఇస్తామంటే వారు అంగీకరించడం లేదు. ప్రస్తుతం మాస్టర్‌ ప్లాన్‌ రహదారులకు వీఎంఆర్‌డీఏ భారీగా భూమిని సేకరిస్తోంది. అయితే టీడీఆర్‌లకు భూములు ఇవ్వబోమని 50 శాతం మంది తెగేసి చెబుతున్నారు. ఇవ్వక తప్పదని తెలిసి కొందరు ముందుకువస్తే...వాటి రిజిస్ట్రేషన్‌కు గతంలోలా గిఫ్డ్‌ డీడ్‌ కాకుండా కన్వేయెన్స్‌ డీడ్‌ చేయాలని, 4.5 శాతం స్టాంపు డ్యూటీ కట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది. దీంతో ఈ పనులు ముందుకు సాగడదం లేదు.

మునిసిపల్‌ పన్నులకు ఉపయోగించుకునేలా చేస్తే మేలు

ఓ.నరేశ్‌కుమార్‌, వైజాగ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌

ఇప్పుడు టీడీఆర్‌లు భవన నిర్మాణాలకే ఉపయోగించుకోవాలని ఇస్తున్నారు. వీటిని జారీ చేసేది పురపాలక శాఖే కాబట్టి...ప్రజలు కట్టాల్సిన మునిసిపల్‌ పన్నులకు కూడా వీటిని ఉపయోగించుకునేలా అవకాశం ఇస్తే బాగుంటుంది. అప్పుడు టీడీఆర్‌లు అందరికీ ఉపయోగపడతాయి. వాటిని కొనడానికి అంతా ముందుకు వస్తారు. దీనివల్ల 90 శాతం వరకు రేటు లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే భూ సేకరణ కూడా సులువు అవుతుంది. ఇదే విషయాన్ని ఎంపీ శ్రీభరత్‌, మంత్రి లోకేశ్‌ లేఖలను ద్వారా కోరాము.

Updated Date - Nov 28 , 2025 | 12:40 AM