Share News

స్టాండింగ్‌ కమిటీపై టీడీపీ కసరత్తు

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:18 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికపై టీడీపీలో భారీ కసరత్తు జరుగుతోంది.

స్టాండింగ్‌ కమిటీపై టీడీపీ కసరత్తు

  • భారీగా ఆశావహులు

  • కార్పొరేటర్లతో సమావేశమైన మేయర్‌ పీలా శ్రీనివాసరావు

  • కొలిక్కిరాకపోవడంతో ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే వదిలేయాలని నిర్ణయం

  • రేపటితో ముగియనున్న నామినేషన్‌ దాఖలు గడువు

  • పోటీలో అభ్యర్థులు ఎవరనేదానిపై ఇప్పటికీ రాని స్పష్టత

  • అవకాశం కోసం ఎమ్మెల్యేలపై కార్పొరేటర్ల ఒత్తిడి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికపై టీడీపీలో భారీ కసరత్తు జరుగుతోంది. స్టాండింగ్‌ కమిటీకి వచ్చేనెల ఆరున ఎన్నిక జరగనుండగా, మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్నది. వైసీపీ అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలుచేయగా, కూటమి నుంచి ఒక్కరు కూడా నామినేషన్‌ వేయలేదు. నామినేషన్ల దాఖలుకు ఒక్కరోజు మాత్రమే గడువున్నప్పటికీ అభ్యర్థులెవరనేదానిపై కూటమి పార్టీలు స్పష్టతకు రాలేకపోతున్నాయి. టీడీపీ నుంచి భారీగా ఆశావహులు ఉండడం, ఎవరూ వెనక్కి తగ్గేదిలేదని భీష్మించుకుని కూర్చోవడంతో అభ్యర్థుల ఎంపిక ఆపార్టీ నేతలకు పరీక్షగా మారింది.

జీవీఎంసీ ప్రస్తుత స్టాండింగ్‌ కమిటీ పదవీకాలం వచ్చేనెల ఆరుతో ముగుస్తుంది. ఆలోగా కొత్త స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక తప్పనిసరిగా పూర్తికావాలి. ఈనేపథ్యంలో జీవీఎంసీ అధికారులు ఈనెల 21న నోటిఫికేషన్‌ జారీచేశారు. వచ్చేనెల ఆరున ఎన్నిక జరపాలని నిర్ణయించారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 29 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఇచ్చారు. కాగా వైసీపీ నుంచి పది మంది కార్పొరేటర్లు ఈనెల 26న నామినేషన్లు దాఖలు చేశారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో మూడుపార్టీలు కలిసి స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పోటీచేయనున్నాయి. స్టాండింగ్‌ కమిటీలో పది మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండడంతో బీజేపీకి ఒకటి, జనసేనకు రెండు స్థానాలను కేటాయించక తప్పని పరిస్థితి నెలకొంది. మిగిలిన ఏడు సీట్లను టీడీపీ తమ కార్పొరేటర్లకు కేటాయించాల్సి ఉంటుంది.

జీవీఎంసీలో బలాబలాలు

జీవీఎంసీలో టీడీపీకి 44 మంది కార్పొరేటర్లు, జనసేనకు 14 మంది, బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లున్నారు. వీరుకాకుండా అనకాపల్లి జోన్‌కు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ఆరోవార్డు కార్పొరేటర్‌ ముత్తంశెట్టి ప్రియాంక గతంలో జరిగిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అవిశ్వాస తీర్మానం, కొత్త మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమయాల్లో టీడీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో వారిని కూడా కలుపుకుంటే మొత్తంగా కూటమికి 63 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వైసీపీకి 34 మంది కార్పొరేటర్లున్నారు. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో గెలుపొందాలంటే వైసీపీకి పడే ఓట్ల కంటే కనీసం ఒక్కటైనా ఎక్కువ రావాలి. అంటే వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఆపార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తే, ఒక్కొక్కరికి 35 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు అవసరం. కూటమికి అంతకంటే 30 ఓట్లు ఎక్కువగా వస్తాయి కాబట్టి కూటమి నుంచి పోటీకి దిగిన అభ్యర్థుల గెలుపు లాంఛనమే. దీంతో టీడీపీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.

ఏడు నెలలే గడువు...

మరో ఏడునెలల్లో పాలకవర్గం పదవీకాలం పూర్తయిపోతుంది కాబట్టి, అందరూ స్టాండింగ్‌ కమిటీలో ఈసారి ఎలాగైనా స్థానం సంపాదించాలని ఆరాటపడుతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలంటూ మేయర్‌ పీలా శ్రీనివాసరావుకు వినతులు అందజేశారు. స్టాండింగ్‌ కమిటీలో పది స్థానాలకు మూడు జనసేన, బీజేపీకి పోతే మిగిలిన ఏడు స్థానాలకు 30 మందికిపైగా పోటీపడుతుండడంతో వారిని వడపోయడం ఎలా అని మేయర్‌ తలపట్టుకున్నారు. టీడీపీ కార్పొరేటర్లతో శనివారం తన చాంబర్‌లో సమావేశం ఏర్పాటుచేసి స్టాండింగ్‌ కమిటీ ఎన్నికపై చర్చించారు. ఈ సందర్భంగా ఆశావహులంతా ఎలాగైనా తమకు అవకాశం ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో పోటీచేసే వారిని తేల్చే బాధ్యతను తాను తీసుకోవడం లేదని, నగరంలోని ఎమ్మెల్యేలకే వదిలిపెడుతున్నామని ప్రకటించేశారు. వారిచ్చే జాబితా ఆధారంగానే అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేస్తారని స్పష్టంచేశారు. దీంతో ఆశావహులంతా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి అవకాశం ఇప్పించాలని ఒత్తిడిచేయడం ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండడంతో ఆలోగా ఎమ్మెల్యేలు అభ్యర్థులను ఖరారుచేయాల్సి ఉంటుంది. జీవీఎంసీ పరిధిలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, ఒక్కో నియోజకవర్గం నుంచి ఒక్కో అభ్యర్థిని ఎంపికచేసినా ఒకరు ఎక్కువ అవుతారు కాబట్టి, పోటీకి దిగే అభ్యర్థుల ఎంపికపై కార్పొరేటర్లతోపాటు పార్టీనేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Jul 28 , 2025 | 01:18 AM