మహిళల ఆర్థిక స్వావలంబనకు టీడీపీ కృషి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:23 AM
మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని, వారిని అన్నిరంగాల్లో ముందుకు నడిపిస్తున్నది తమ పార్టీ మాత్రమేనని జీసీసీ చైర్మన్, టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు.

అతివలతో వంద కాఫీ అవుట్‌లెట్ల ఏర్పాటుకు చర్యలు
జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్
పాడేరు, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక స్వావలంబనకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని, వారిని అన్నిరంగాల్లో ముందుకు నడిపిస్తున్నది తమ పార్టీ మాత్రమేనని జీసీసీ చైర్మన్, టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. తన స్థానిక క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు నాడు చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారన్నారు. అలాగే దళిత మహిళలను అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే కోటా తాజా ఎమ్మెల్సీ ఎంపికలోనూ దళిత మహిళకు స్థానం కల్పించారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళల కోసం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. గత వైసీపీ పాలనలో మహిళలపై అరాచకాలు, హత్యలు, అత్యాచారాలే గాని వారి అభివృద్ధికి కనీస కృషి చేయలేదని ఆరోపించారు.
మహిళలతో వంద అరకు కాఫీ అవుట్‌లెట్లు ఏర్పాటు
ప్రపంచ గుర్తింపు పొందిన అరకు కాఫీకి మరింత ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు గాను తొలి దశలో వంద కాఫీ అవుట్ లెట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్థం చేస్తున్నామని కిడారి శ్రావణ్‌కుమార్ ప్రకటించారు. వినియోగదారులకు నాణ్యమైన కాఫీ అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కాఫీ అవుట్‌లెట్లు ఉపయోగపడతాయన్నారు. మహిళలు స్వయం శక్తి సాధించేందుకు ఉన్న అవకాశాలన్నీ వారికి చేరువ చేస్తామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు పాంగి పాండురంగస్వామి, సాగర సుబ్బారావు, ఎ.తిరుపతిరావు, కొమ్మా రమా, వెంకటరావు, త్రినాథ్, సత్యవతి, మహేశ్వరి, రంగరాజు, అచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.