కాలుష్య నియంత్రణకు టాస్క్‌ఫోర్స్
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:25 AM
భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపక్కన డంప్ చేస్తే వాహనాలకు భారీ జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి, యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ స్పష్టంచేశారు.
నగరంలో గాలి నాణ్యత పెంచేందుకు విస్తృత చర్యలు
భవన శిథిలాలు రోడ్డు పక్కన వేస్తే క్రిమినల్ కేసు నమోదు
15 ఏళ్లు దాటిన వాహనాల తనిఖీకి నిర్ణయం
కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడి
విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):
భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపక్కన డంప్ చేస్తే వాహనాలకు భారీ జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసి, యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ స్పష్టంచేశారు. భవన వ్యర్థాలు తరలించే సమయంలో సంబంధిత సచివాలయం సిబ్బందికి తప్పనిసరిగా తెలియజేయాలన్నారు. కొత్త భవనాల నిర్మాణం, పాత భవనాల కూల్చివేత సమయంలో గ్రీన్ మేట్‌లతో చుట్టూ పరదాలు ఏర్పాటుచేయాలన్నారు. నగరంలో గాలినాణ్యత పెంచేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామన్నారు. కాలుష్యం తగ్గింపుపై శనివారం అధికారులతో సమీక్షించిన కలెక్టర్, అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాలుష్య నియత్రంణకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళతాయన్నారు. ఇందుకు ప్రత్యేకంగా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి క్వాలిటీ మానటరింగ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పోలీసు కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, జాతీయ రహదారుల విభాగం పీడీ, జిల్లా రవాణాధికారి, ఆర్టీసీ ఆర్‌ఎం, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, జిల్లా పౌరసరఫరాల అఽధికారి, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ, జిల్లా పంచాయతీ అధికారి సభ్యులుగానూ, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారని పేర్కొన్నారు. నగర పరిధిలో చెత్త కాలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తడి, పొడిచెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని కోరారు. కర్మాగారాలలో పొగ విడిచిపెట్టే చిమ్నీలు, పోర్టులో బొగ్గు నిల్వలపై టార్పాలిన్ల ఏర్పాటుపై పీసీబీ అధికారులు తనిఖీలు చేపట్టాలని ఆదేశించామన్నారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను తనిఖీ చేయాలని రవాణా శాఖకు సూచించామన్నారు. పాతబస్సుల నుంచి కాలుష్యం రాకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండేళ్ల తరువాత నగరంలో భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులకు సంబంధించి బీఎస్-6 వాహనాలు వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
కేబుల్స్ కోసం తవ్విన గోతులు వెంటనే పూడ్చేయాలి
విద్యుత్ కేబుల్స్ కోసం గోతులు తవ్విన ప్రాంతంలో వెంటనే పనులు పూర్తిచేయడం, ధూళి రాకుండా చర్యలు తీసుకునేలా ఈపీడీసీఎల్ అధికారులను ఆదేశించినట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. పెట్రోల్ బంకుల తనిఖీ ద్వారా కల్తీని కట్టడి చేస్తామన్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద సిగ్నల్ పడే సమయంలో వాహనాల ఇంజన్లు ఆపితే కాలుష్యం తగ్గుతుందన్నారు. దీనిపై వలంటీర్ల ద్వారా వాహనదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. నగరంలో అన్ని ప్రాంతాల నుంచి చెత్తను తరలించే సమయంలో టార్పాలిన్‌తో కప్పాలని, ఏ వాహనం నుంచి చెత్త రోడ్లపై జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీవీఎంసీ వాహనాల నిర్వహణపై అధికారులు అప్రమ్తత్తంగా ఉండాలన్నారు. కాలుష్య నియంత్రణ, గాలి నాణ్యత పెరిగేందుకు రోజువారీ నివేదికలు ఇవ్వాలని కమిటీని ఆదేశించినట్టు కలెక్టర్ తెలిపారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కాలుష్య రహిత నగరం కోసం ప్రభుత్వానికి ప్రజలు, వాహనదారులు, పరిశ్రమల యజమానులు సహకరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరు పి.ముకుందరావు, జిల్లా పంచాయతీ అధికారి ఎంఎన్వీ. శ్రీనివాసరావు పాల్గొన్నారు.