Share News

కాలుష్య నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌

ABN , Publish Date - Dec 20 , 2025 | 01:38 AM

నగరంలో గాలి నాణ్యత మెరుగుపడేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య సూచించారు.

కాలుష్య నియంత్రణకు టాస్క్‌ఫోర్స్‌

కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌

నగరంలో గాలి నాణ్యత

మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య సూచన

పరిమితికి మించి పీఎం-10, పీఎం-2.5 నమోదు కావడంపై ఆందోళన

విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

నగరంలో గాలి నాణ్యత మెరుగుపడేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పి.కృష్ణయ్య సూచించారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, ఇతర అఽధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గాలిలో నాణ్యత పెంచేందుకు, ధూళి కాలుష్యం తీవ్రత తగ్గించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇటీవల నగరం, పరిసరాల్లో గాలి నాణ్యత క్షీణించడం, నాణ్యతా సూచిక ఆందోళనకరమైన స్థాయికి చేరడంపై కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. పీఎం-10, పీఎం-2.5 పరిమితికి మించి ఉన్నట్టు గుర్తించామన్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ మాట్లాడుతూ గాలి నాణ్యత క్షీణించడానికి ప్రధానంగా పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, రోడ్లపై ధూళి కణాలు, భూగర్భ కేబుల్స్‌ నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకాలు, భవన నిర్మాణాలు/కూల్చివేతలు, నగరంలో ఘన వ్యర్థాలను ఆరుబయట పారవేయడం, వ్యర్థాలను విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను తరలించకుండా నిప్పుపెట్టడం, ప్రధాన ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద వాహనాల నుంచి వచ్చే కాలుష్యం వంటివి కారణమన్నారు. కాలుష్యం పెరగడానికి కారణమైన హాట్‌స్పాట్‌లను గుర్తించి నివారణకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేస్తామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్‌ మాట్లాడుతూ నగరంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మాత్రమే ఆన్‌లైన్‌ మానటరింగ్‌ యంత్రం ఉందని, నగరంలో మరికొన్ని కొత్త స్టేషన్లు ఏర్పాటుచేయాలన్నారు. వాహనాల కాలుష్యం తగ్గించేందుకు ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. సమావేశంలో పలు శాఖల అధికారులు, భారీ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.


టెట్‌కు 90.09 శాతం హాజరు

విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ఏడు కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు మొత్తం 1,848 మందికి గాను 1,680 (90.09 శాతం) మంది హాజరయ్యారు. ఉదయంపూట పరీక్షకు 688 మందికిగాను 619 మంది, మధ్యాహ్నం పరీక్షకు 1,162 మందికిగాను 1,061 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ మూడు కేంద్రాలు సందర్శించారు.


జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు వాయిదా

విశాఖపట్నం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనకాపల్లి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో శనివారం జరగాల్సిన జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలను ఈనెల 26వ తేదీకి వాయిదా వేశామని సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. ఈ విషయాన్ని సభ్యులు, అధికారులు గమనించి ఈనెల 26వ తేదీన హాజరుకావాలని కోరారు.

Updated Date - Dec 20 , 2025 | 01:38 AM