Share News

భూ కబ్జాదారులపై ఉక్కుపాదం

ABN , Publish Date - Dec 19 , 2025 | 12:55 AM

విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాలు అధికంగా ఉన్నాయని, వాటిని నిరోధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

భూ కబ్జాదారులపై ఉక్కుపాదం

అమరావతి సదస్సులో విశాఖ కలెక్టర్‌కు సీఎం ఆదేశాలు

భూ తగాదాల్లో నేతల ప్రమేయం ఉండకూడదు

ఆటోమ్యుటేషన్ల రిజెక్షన్‌ తగ్గాలి

ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలి

విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం జిల్లాలో భూ కబ్జాలు అధికంగా ఉన్నాయని, వాటిని నిరోధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. విజయవాడలో రెండో రోజు గురువారం కలెక్టర్ల సమావేశంలో జిల్లాల వారీగా వివిధ శాఖల పనితీరును విశ్లేషించి, సూచనలు చేశారు. భూ సంబంధిత అంశాలు చర్చకు వచ్చినప్పుడు విశాఖలో భూములు పెద్ద సంఖ్యలో కబ్జాకు గురవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. విశాఖ జిల్లాలోని భూ తగాదాల్లో రాజకీయ నాయకులు తలదూరుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రస్తావించగా, నాయకుల ప్రమేయం ఉండకూడదని, న్యాయబద్ధంగా వివాదాలు పరిష్కరించాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ జరిగిన తరువాత ఆ వివరాలు రెవెన్యూ శాఖకు మ్యుటేషన్‌ కోసం వెళుతున్నాయని, కొన్ని జిల్లాల్లో వాటిని రికార్టు చేయకుండా రిజెక్ట్‌ చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలా పెద్ద సంఖ్యలో రిజెక్ట్‌ అవుతున్న జిల్లాల్లో విశాఖపట్నం మూడో స్థానంలో ఉందని, వెంటనే సంబంధిత అధికారులకు చెప్పి సక్రమంగా మ్యుటేషన్‌ జరిగేలా చూడాలని ఆదేశించారు. విశాఖపట్నం జిల్లాలో మ్యుటేషన్‌ ఫైళ్ల రిజెక్షన్‌ 33.67 శాతంగా ఉందన్నారు. అంటే మూడొంతుల ఫైళ్లు వెనక్కి వస్తున్నాయన్నారు. ప్రభుత్వ భూముల జాబితా- 22 ఏనిర్వహణలో జిల్లా రిజిస్ట్రార్‌తో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వంలో భూ వివాదాలు సృష్టించడానికి, ఆయా భూములు దక్కించుకోవాలని అప్పటి నాయకుల ఒత్తిడితో అధికారులు కొన్నింటిని 22-ఏలో చేర్చారని, వాటిని ఆ జాబితా నుంచి తప్పించాలని బాధితులు కలెక్టర్ల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని సీఎం వివరించారు. వీటిని సమగ్రంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని పరిష్కారానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు. ఫైళ్లు తమ దగ్గర క్లియర్‌ అయ్యాయని చెప్పడానికి ఉన్నతాధికారులు వాటిని కింది స్థాయి అధికారులకు పంపేసి చేతులు దులుపుకుంటున్నారని, ఇకపై వాటిని కూడా ట్రాక్‌ చేస్తామని సీఎం హెచ్చరించారు. క్లియరెన్స్‌ అంటే కిందికి పంపడం కాదని, పరిష్కారం చూపించాలని స్పష్టంచేశారు. ప్రజల సంతృప్తే కొలమానంగా పనిచేయాలన్నారు.

విశాఖపట్నం జిల్లాలో ఆస్తిపన్ను రూ.660.54 కోట్లకుగాను ఇప్పటివరకూ రూ.288.1 కోట్లు మాత్రమే వసూలైందని, ఇది సగం కంటే తక్కువ 43.62 శాతంగా ఉందని, వసూళ్లు పెంచాలని సూచించారు.

పంచాయతీ పన్నుల వసూళ్లలో

విశాఖకు రెండోస్థానం

స్వామిత్ర సర్వేలో ఎనిమిదో స్థానం

కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం నివేదిక

విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీల పరిధిలో పన్ను వసూళ్లలో విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. బకాయిలు రూ.1.93 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డిమాండ్‌ రూ.ఏడు కోట్లు...మొత్తం 8.93 కోట్లకుగాను ఈనెల 14వ తేదీ వరకూ 2.38 కోట్లు (27 శాతం) వసూలయ్యాయి. అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సు రెండో రోజు గురువారం పలు శాఖలకు సంబంధించి నివేదిక విడుదల చేశారు. విశాఖ జిల్లాలో 79 గ్రామ పంచాయతీలు ఉండగా..బకాయిలు రూ.36 లక్షలు, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.02 కోట్లు వసూలు చేశారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా పన్నులు, పన్నేతర వసూళ్లు వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అదేవిధంగా గ్రామ కంఠాల్లో ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక అవసరాల కోసం వినియోగిస్తున్న ఆస్తుల వివరాలు నమోదు కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘స్వామిత్ర’ సర్వేలో విశాఖ జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది. రెండో విడత మొత్తం 44 గ్రామాల్లో సర్వే పూర్తిచేయాల్సి ఉండగా, ఇప్పటివరకూ 31 గ్రామాల (70.5 శాతం)లో పూర్తిచేశారు. ఈ పథకంలో ప్రతి వ్యక్తి నివసించే ఇంటికి హద్దులు గుర్తించి, అతడి పేరిట డాక్యుమెంట్‌ ఇస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌ రికార్డులలో ప్రతి కుటుంబం వివరాలు నమోదుచేస్తారు. దీనివల్ల నివసించే ఇళ్లపై పూర్తి హక్కులు దఖలు పడతాయి.

- గనుల ఆదాయంలో రాష్ట్రంలో విశాఖ జిల్లా వాటా 0.9 శాతమే. దీనికి సంబంధించి రూ.154 కోట్లు లక్ష్యంగా విధించారు. మేజర్‌ మినరల్స్‌ కోసం 18 దరఖాస్తులు రాగా ఐదింటిని ఆమోదించగా, 13 దరఖాస్తులను పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర పన్నుల శాఖ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీఎస్టీ కింద రూ.3435.24 కోట్లు, ఇతర పన్నులతో కలిసి 13,030.44 కోట్లు వసూలు చేశారు. గత నెలలో జీఎస్టీ కింద రూ.458 కోట్లు, ఇతర పన్నులతో కలిపి రూ.1,633.26 కోట్లు వసూలుచేశారు. సూపర్‌ జీఎస్టీ పేరిట ప్రచార కార్యక్రమాల నిర్వహణలో విశాఖ జిల్లా 14వ స్థానంలో నిలిచింది.

రోడ్డు ప్రమాదాలు విశాలోనే అధికం!

నియంత్రణకు చర్యలు తీసుకోవలసిందిగా సీఎం ఆదేశం

రోడ్డు ప్రమాదాల్లో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకూ రాష్ట్రంలో 15,583 ప్రమాదాలు జరిగాయి. 600కు పైగా ప్రమాదాలు జరిగిన ఐదు జిల్లాల్లో విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. రోడ్డు ప్రమాదాలను జీరో స్థాయికి తగ్గించడానికి వచ్చే నెల ఒకటి నుంచి 31 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి అక్కడ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Dec 19 , 2025 | 12:55 AM