జడ్పీ స్థలాలను స్వాధీనం చేసుకోండి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:18 PM
మేజర్ పంచాయతీ కొత్తూరులో ఆక్రమణకు గురైన జిల్లా పరిషత్ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ముత్రాసు కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలుకు మూడు ఎకరాలను కేటాయించాలని జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధికారులను ఆదేశించారు.
అధికారులకు చైర్‌పర్సన్ సుభద్ర ఆదేశం
కొత్తూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీ కొత్తూరులో ఆక్రమణకు గురైన జిల్లా పరిషత్ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ముత్రాసు కాలనీలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలుకు మూడు ఎకరాలను కేటాయించాలని జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ముత్రాసి కాలనీలోని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సరైన ఆట స్థలం లేకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. కొత్తూరు వద్ద శారదా నదిని ఆనుకొని జిల్లా పరిషత్‌కు చెందిన 12 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, పంచాయతీ రాజ్ సిబ్బందిని ఆదేశించారు. ఆంజనేయస్వామి ఆలయానికి పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించి స్కూలు కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తరువాత ఆమె ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. కొత్తూరులో నిర్మితమైన నూతన భవనంలోకి ఆర్డీవో కార్యాలయాన్ని తరలించి జిల్లా పరిషత్ అతిథిగృహాన్ని (చాలా కాలం నుంచి ఆర్డీవో కార్యాలయం, జడ్పీ అతిథిగృహంలో నడుస్తున్నది) తిరిగి తమకు అప్పగించాలని ఆర్డీవో ఆయీషాను కోరారు. పది రోజుల్లో అతిథిగృహాన్ని ఖాళీ చేసి అప్పగిస్తామని ఆర్డీవో చెప్పారు. జడ్పీ చైర్‌పర్సన్ వెంట ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎంపీడీవో పి.ఆశాజ్యోతి, జడ్పీ వైస్ చైర్‌పర్సన్ భీశెట్టి వరహాసత్యవతి, తదితరులు వున్నారు.