జనవరి 28న టీ-20
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:05 AM
టీ-20 మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. పోతినమల్లయ్యపాలెం లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 28న న్యూజిభారత్, న్యూజిలాండ్ మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది.
భారత్ న్యూజిలాండ్ మధ్య క్రికెట్ మ్యాచ్
వేదిక ఏసీఏ- వీడీసీఏ స్టేడియం
విశాఖపట్నం, స్పోర్ట్సు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):
టీ-20 మ్యాచ్‌కు విశాఖ ఆతిథ్యమివ్వనుంది. పోతినమల్లయ్యపాలెం లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో వచ్చే ఏడాది జనవరి 28న న్యూజిభారత్, న్యూజిలాండ్ మధ్య అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరగనుంది. భారత్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సంబంధించి జనవరి 21న తొలి టీ20 నాగపూర్, రెండో మ్యాచ్ జనవరి 23న రాయపూర్, మూడో టీ20 జనవరి 25న గువహటి, జనవరి 28న నాల్గో మ్యాచ్ విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆడనున్నారు. దీంతో ఇప్పటివరకు మూడు టెస్టు మ్యాచ్‌లు, పది వన్డే మ్యాచ్‌లు, నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన విశాఖ త్వరలో ఐదో టీ20 మ్యాచ్ నిర్వహణకు సిద్ధమవుతోంది. ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా గత నెల మహిళల ప్రపంచకప్ టోర్నీలోని ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన విశాఖ డిసెంబరు 6న భారత్, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు సమాయత్తమవుతుండగా, జనవరి 28న భారత్, న్యూజిలాండ్ మధ్య టీ-20 మ్యాచ్ నిర్వహించనుంది.
టెన్త్, ఇంటర్ పరీక్షలకు సన్నాహాలు
కేంద్రాల ఎంపికలో ఇబ్బందులపై అధికారుల ఆరా!
విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):
వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్య, ఇంటర్ బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్, మార్చి 16 నుంచి పదో తరతగతి పరీక్షలకు ఇప్పటికే టైమ్‌టేబుల్ విడుదలైంది. ఇంటర్మీడియట్‌లో తొలిసారిగా సీబీఎస్‌ఈ సిలబస్ ఆధారంగా ప్రశ్నపత్రం రూపొందిస్తుండడంతో పరీక్షలు కూడా ఎక్కువ రోజులు జరగనున్నాయి. ఇప్పటివరకు 12 రోజుల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించేవారు. ఈ పర్యాయం సీబీఎస్‌ఈలో రోజుకు ఒక పరీక్ష మాత్రమే నిర్వహిస్తారు. గతంలో ఇంటర్మీడియట్‌లో ఒక రోజు సైన్స్, ఆర్ట్స్ కోర్సులకు సంబంధించి పరీక్షలు నిర్వహించేవారు. ఉదాహరణకు గణితం, అర్థశాస్త్రం పరీక్ష ఒకే రోజు ఉండేది. సీబీఎస్‌ఈలో గణితం పరీక్ష నిర్వహించే రోజు మరే సబ్జెక్టు పరీక్ష ఉండదు. అందువల్ల 23 రోజులపాటు నిర్వహిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షలు ముగియకముందే పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతాయి. అందువల్ల కేంద్రాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇరుశాఖల అధికారులు నిర్ణయించారు. జూనియర్ కళాశాలలను ఇంటర్ పరీక్ష కేంద్రాలుగా, పాఠశాలలను పదోతరగతి పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేస్తున్నందున ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశం ఉందా అనేదానిపై ఇరు శాఖల అధికారులు సమావేశమై చర్చించారు.