గీత కార్మికుల బార్‌లు కొట్టేసిన సిండికేట్లు?
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:03 AM
జిల్లాలో బార్‌ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
మామూలు బార్‌కైతే లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.75 లక్షలు
అదే గీత కార్మికుల బార్‌కైతే రూ.32.5 లక్షలే
అందుకే వాటిపై కన్నేసిన కొంతమంది మద్యం వ్యాపారులు
పది బార్‌లకు నాలుగేసి దరఖాస్తులు దాఖలు
ఎక్సైజ్ శాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో బార్‌ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన బార్ పాలసీ వ్యాపారులకు గిట్టుబాటుగా లేకపోవడంతో పెద్దగా స్పందన రాలేదు. కానీ గీత కార్మికులకు కేటాయించిన బార్‌లకు సగం లైసెన్స్ ఫీజును రాయితీగా ప్రకటించడంతో వాటికి పోటీ ఏర్పడింది. కొంతమంది మద్యం వ్యాపారులే సిండికేట్‌గా ఏర్పడి గీత కార్మికులతో దరఖాస్తులు చేయించారనే ప్రచారం జరుగుతోంది. అందుకు సహకరించినందుకు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఒక్కో బార్‌కు రూ.లక్షల్లోనే ముట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 121 బార్‌లకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్ జారీచేసింది. బార్‌కు ఏడాదికి లైసెన్స్ ఫీజు రూ.75 లక్షలుగా నిర్ణయించింది. దరఖాస్తు ఫీజు కింద మరో రూ.5.1 లక్షలు చెల్లించాలి. ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహిస్తామని షరతు విధించింది. ప్రస్తుతం ప్రైవేటు మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సాధారణ, మధ్య తరగతికి చెందినవారు బార్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. మద్యం దుకాణం వద్ద పర్మిట్‌రూమ్‌లో కూర్చొని మద్యం సేవించే వెసులుబాటు ఉండడంతో బార్‌కు వెళ్లి అధికధర చెల్లించాల్సిన అవసరం ఏమిటని మందుబాబులు భావిస్తున్నారు. కేవలం సంపన్న వర్గాలకు చెందినవారు మాత్రమే బార్‌కు వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో వ్యాపారం తగ్గిపోవడంతోపాటు నిర్వహణ ఖర్చులు భారీగా ఉంటాయనే భావనతో వ్యాపారులు బార్‌ల వైపు ఆసక్తిచూపడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో 121 బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 45 బార్‌లకు దరఖాస్తులు రాకపోవడంతో వాటి కేటాయింపులు నిలిచిపోయాయి. ఇదిలావుండగా గీత కార్మికుల కోటా కింద జిల్లాకు పది బార్‌లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. గీతకార్మికుల కోటాలోని బార్‌లకు కేవలం రూ.32.5 లక్షలు మాత్రమే లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది. అంటే ఏడాదికి రూ.32.5 లక్షలు చొప్పున మూడేళ్ల కాలపరిమితికి సుమారు రూ.కోటి వరకు లైసెన్స్ ఫీజు మిగులుతుంది. దీంతో మద్యం వ్యాపారంలో ఆరితేరిన కొందరు గీత కార్మికుల కోటాలోని బార్‌లను దక్కించుకోవడంపై దృష్టిసారించారు. వారంతా సిండికేట్‌గా ఏర్పడి వారికి తెలిసిన గీత కార్మికుల పేర్లతోనే దరఖాస్తు చేయించారు. ఒక్కోబార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలనే నిబంధన ఉండడంతో ఒక్కో బార్‌కు నాలుగు మాత్రమే వచ్చేలా చక్రం తిప్పారు. దీనికి సహకరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులను కోరగా, వారు కూడా సరేననడంతో గీత కార్మికుల బార్‌లన్నీ సిండికేట్‌ల చేతికే చిక్కాయి. దీనికోసం ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కో బార్‌కు ఇంత అని చెప్పి తొమ్మిది బార్‌లకు భారీ మొత్తం వసూలు చేసినట్టు మద్యం వ్యాపారంలో ఉన్నవారే ఆరోపిస్తున్నారు. గీత కార్మికుల కోటాలో బార్‌లు కేటాయించిన అధికారులు ఆయా లైసెన్స్ ఫీజు కింద చెల్లింపులు ఎవరి బ్యాంకు ఖాతాల నుంచి జరిగాయనేది పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయని, దీనిపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు దృష్టిసారించాలని మద్యం వ్యాపారులు కొందరు డిమాండ్ చేస్తున్నారు. గీత కార్మికుల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ ఫీజులో సగం రాయితీ కల్పిస్తే దానిని సిండికేట్లు కొట్టేయడం దారుణమంటున్నారు. ఈ విషయం ఎక్సైజ్ శాఖలోని ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించగా, మద్యం వ్యాపారుల్లో వర్గ విభేదాల కారణంగానే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయన్నారు. వారి ఆధిపత్యం కోసం తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేశారు.