కార్మికురాలి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - May 30 , 2025 | 12:55 AM
మండలంలోని గుడివాడ సమీపంలో ఉన్న సాయి మెరైన్ రొయ్యల పరిశ్రమలో పని చేస్తున్న ఓ కార్మికురాలు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ విభీషణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
సాయి మెరైన్ పరిశ్రమలో పని చేస్తూ అక్కడే వసతి గృహంలో నివాసం
తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలింపు
అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
ఎస్. రాయవరం, మే 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గుడివాడ సమీపంలో ఉన్న సాయి మెరైన్ రొయ్యల పరిశ్రమలో పని చేస్తున్న ఓ కార్మికురాలు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ విభీషణరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతానికి చెందిన హులకా అనిత(19) గత నెల రోజులుగా రొయ్యల పరిశ్రమలో పని చేస్తూ, అక్కడే ఉన్న వసతి గృహంలో ఉంటోంది. బుధవారం ఉదయం ఆమె పనికి వెళ్లింది. అయితే ఆమె ఆరోగ్యం బాగోకపోవడంతో వసతి గృహానికి పంపేశారు. అదే రోజు రాత్రి ఆమె తీవ్ర అస్వస్థతకు గురై తన గదిలో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవడంతో రొయ్యల పరిశ్రమ యాజమాన్యం అంబులెన్స్‌లో నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. కార్మికురాలి మృతిపై ఆ పరిశ్రమ మేనేజర్ రఘు నుంచి ఆర్‌ఐ మణికంఠ, వీఆర్వో రాజు వివరాలు సేకరించారు. అయితే కార్మికురాలు మృతి చెందిన విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.