Share News

ట్రాన్స్‌జెండర్‌ హత్య కేసులో నిందితుడి అరెస్టు

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:42 AM

ట్రాన్స్‌జెండర్‌ మైపాలి దిలీప్‌శంకర్‌ అలియాస్‌ దీపు (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.

ట్రాన్స్‌జెండర్‌ హత్య కేసులో నిందితుడి అరెస్టు
మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా, పోలీసు అధికారులు, ముఖానికి నల్లటి ముసుగుతో వున్న నిందితుడు బండి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ బన్నీ

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా

పెళ్లి విషయంలో ఇరువురి మధ్య కొంతకాలంగా గొడవ

రెండో పెళ్లి చేసుకుంటానన్న బన్నీ

తనను మాత్రమే వివాహం చేసుకోవాలని పట్టుబట్టిన దీపు

ట్రాన్స్‌జెండర్‌ను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో హత్య

మృతదేహాన్ని ముక్కలుగా నరికి, మూడుచోట్ల పడవేత

ప్రత్యేక బృందాల ఏర్పాటుతో గంటల వ్యవధిలోనే నిందితుడి గుర్తింపు, అరెస్టు

కశింకోట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌జెండర్‌ మైపాలి దిలీప్‌శంకర్‌ అలియాస్‌ దీపు (35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.

అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం ప్రాంతానికి చెందిన మైపాలి దిలీప్‌ శంకర్‌ అలియాస్‌ దిపు, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి చెందిన బండి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ బన్నీ (24) సుమారు ఏడాది నుంచి మునగపాక మండలం నాగులాపల్లిలో ఒక అద్దె ఇంటిలో వుంటూ సహజీవనం చేస్తున్నారు. పెళ్లి విషయమై కొద్ది రోజులుగా ఇరువురి మధ్య గొడవ జరుగుతున్నది. ఈ నెల 17వ తేదీన మరోసారి పెళ్లి ప్రస్తావన రాగా.. రెండో భార్యగా వివాహం చేసుకుంటానని దుర్గాప్రసాద్‌ చెప్పాడు. ఇందుకు దీపు అంగీకరించలేదు. తనను మాత్రమే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. దీంతో దీపును ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నాగులాపల్లి ఇంటిలోనే దీపు మెడకు వైరు బిగించి హత్య చేశాడు. తరువాత మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి కత్తితో శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మూడు మూటలుగా కట్టి బైక్‌, స్కూటీపై (బుల్లెట్‌ దురాప్రసాద్‌ది, స్కూటీ దీపుది) వేర్వేరు సమయాల్లో తీసుకెళ్లి జలగలమదుం జంక్షన్‌ సమీపంలో, తాళ్లపాలెం సమీపంలో అండర్‌ బ్రిడ్జి వద్ద, బయ్యవరం అండర్‌ బ్రిడ్జి వద్ద పడేశాడు. పోలీసులు మంగళవారం ఉదయం తొలుత బయ్యవరం వద్ద కొన్ని శరీర భాగాలు వున్న ఒక మూటను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మిగిలిన శరీర భాగాల కోసం పోలీసులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం జలగలమందుం జంక్షన్‌ వద్ద ఒక మూటను, తరువాత తాళ్లపాలెం మామిడివాక గెడ్డ వద్ద మరోమూటను స్వాధీనం చేసుకుని హత్యకు గురైంది ట్రాన్స్‌జెండర్‌ మైపాలి దిలీప్‌ శంకర్‌ అలియాస్‌ దిపుగా నిర్ధారించారు. నాగులాపల్లిలో దీపుతో కలిసి వుంటున్న దుర్గాప్రసాద్‌ అలియాస్‌ బన్నీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 19వ తేదీ సాయంత్రం 6.30 గంటల సమయంలో కశింకోట మండలం విస్సన్నపేట వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. దీపును వదిలించుకుని, ఆమె వద్ద వున్న బంగారు ఆభరణాలు, నగదును సొంతం చేసుకోవడానికే దుర్గాప్రసాద్‌ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని ఎస్పీ చెప్పారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, నగదు, నాలుగు బంగారు గాజులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టి కఠిన శిక్ష పడేలా చార్జీషీటు ఫైల్‌ చేస్తామని ఆయన చెప్పారు. హత్య కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసు దర్యాప్తు బృందాలను, క్లూస్‌ టీమ్‌ను, డీఎస్పీ శ్రావణి, సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐలు లక్ష్మణరావు, మనోజ్‌కుమార్‌, పోలీసు సిబ్బందిని ఎస్పీ తుహిన్‌ సిన్హా అభినందించారు.

Updated Date - Mar 21 , 2025 | 12:42 AM