Share News

సీ ప్లేన్‌ నిర్వహణకు సర్వేలు పూర్తి

ABN , Publish Date - Jul 17 , 2025 | 11:05 PM

పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం నుంచి సీలేరుకు సీ ప్లేన్‌ నడిపేందుకు దాదాపు సర్వేలు అన్నీ పూర్తయ్యాయని జీకే వీధి తహశీల్దార్‌ రామకృష్ణ తెలిపారు. మరో రెండు, మూడు నెలల్లో సీ ప్లేన్‌ అందుబాటులోకి రానున్నదన్నారు.

సీ ప్లేన్‌ నిర్వహణకు సర్వేలు పూర్తి
సీ ప్లేన్‌ పోర్టు ఏర్పాటుకు సీలేరు మారెమ్మ ఆలయం వద్ద గల ఘాట్‌ ప్రదేశాన్ని జెన్‌కో అధికారులతో కలిసి పరిశీలిస్తున్న తహశీల్దార్‌ రామకృష్ణ (ఫైల్‌)

త్వరలో విశాఖ నుంచి సీలేరుకు సేవలు

సీలేరు జలాశయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని సర్వే నివేదిక

పర్యాటక పరంగా గణనీయమైన అభివృద్ధి

జీకే వీధి తహశీల్దార్‌ రామకృష్ణ

సీలేరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం నుంచి సీలేరుకు సీ ప్లేన్‌ నడిపేందుకు దాదాపు సర్వేలు అన్నీ పూర్తయ్యాయని జీకే వీధి తహశీల్దార్‌ రామకృష్ణ తెలిపారు. మరో రెండు, మూడు నెలల్లో సీ ప్లేన్‌ అందుబాటులోకి రానున్నదన్నారు. గురువారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ జీకేవీధి మండలంలోని సీలేరు జలాశయం సీ ప్లేన్‌ నిర్వహణకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని, ఇది రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ సీ ప్లేన్‌ పోర్టుగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. సీ ప్లేన్‌ నిర్వహణకు అవసరమైన సర్వేలన్నీ దాదాపు పూర్తయ్యాయని, చివరిగా ఆప్టికల్‌ లిమిట్స్‌ సర్ఫేస్‌ సర్వే(ఆప్టికల్‌ పరిమితుల ఉపరితల సర్వే) మాత్రమే చేయాల్సి ఉందన్నారు. ఇది మరో నెల రోజుల్లో నిర్వహిస్తారని చెప్పారు. సీ ప్లేన్‌ ప్రాజెక్టు కోసం అవసరమైన రెండున్నర ఎకరాల భూమికి కూడా జెన్‌కో అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఈ రెండున్నర ఎకరాల్లో అర ఎకరంలో పోర్టు నిర్మాణం, మిగతా ప్రదేశాన్ని పర్యాటకంగా సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతారని చెప్పారు. దీంతో సీలేరు ప్రాంతం పర్యాటకంగా మరింగా అభివృద్ధి చెందనున్నదని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీ ప్లేన్‌ ప్రాజెక్టు సర్వేకు, భూమి అనుమతులు మంజూరు తదితర అంశాల్లో స్థానిక జెన్‌కో ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, ఇతర జెన్‌కో అధికారులు సహాయ సహకారాలను అందించడంతో సీలేరులో మరో రెండు, మూడు నెలల్లో సీ ప్లేన్‌ అందుబాటులోకి రానున్నదని తెలిపారు. ఇప్పటి వరకు పర్యాటకుల దృష్టిలో సీలేరు అంటే జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రంగానే గుర్తింపు ఉందని, సీ ప్లేన్‌ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పర్యాటక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు.

Updated Date - Jul 17 , 2025 | 11:05 PM