ఏసీబీకి చిక్కిన సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:16 AM
ములగాడ మండల తహశీల్దార్ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు గురువారం ఏసీబీ వలకు చిక్కారు.
సర్వే నంబర్ సరిచేసేందుకు రూ.30 వేలు డిమాండ్
మల్కాపురం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
ములగాడ మండల తహశీల్దార్ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు గురువారం ఏసీబీ వలకు చిక్కారు. వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన బోడేపల్లి రవితేజ తన ఇంటికి సంబంధించి సర్వే నంబర్ తప్పుగా ఉన్నదని, సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ములగాడ మండల తహశీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును పరిశీలించిన సర్వేయర్ రంగోలి సత్యనారాయణ రిపోర్టు ఇచ్చేందుకు రూ.30 వేలు డిమాండ్ చేశాడు. అందుకు రవితేజ అంగీకారం తెలపడంతో, గురువారం సాయంత్రం కంచరపాలెం సమీపంలో గల పంజాబ్ హోటల్ వద్ద ఉన్న సచివాలయం వద్దకు డబ్బులు తీసుకురావాలని రవితేజకు తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నగేష్ చెప్పాడు. రవితేజ ఏసీబీ ట్రోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. అనంతరం డబ్బులు పట్టుకొని సచివాలయం వద్దకు బయలుదేరాడు. అక్కడ అతడి వద్ద నుంచి నగేష్ డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడకు చేరుకున్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్ సత్యనారాయణ డబ్బులు తీసుకోమన్నాడని అతను చెప్పడంతో ఏసీబీ అధికారులు అక్కడి నుంచి నేరుగా ములగాడ మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి సర్వేయర్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా సిబ్బంది నుంచి కూడా ఫోన్‌లు తీసుకొని..కొంతసేపు తరువాత తిరిగి ఇచ్చేశారు. సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్‌లను అవినీతి నిరోధశాఖ సెక్షన్ ప్రకారం 2018 సెక్షన్ 7 కింద అరెస్టు చేశారు. శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.