Share News

రౌడీషీటర్ల కదలికలపై నిఘా

ABN , Publish Date - May 22 , 2025 | 01:29 AM

నగరంలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని అధికారులను పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో సీఐ అంతకంటే పైస్థాయి అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

రౌడీషీటర్ల కదలికలపై నిఘా

గంజాయి రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేయాలి

అధికారులకు పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ఆదేశం

ఎవరైనా అవినీతికి పాల్పడినా,

నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని అధికారులను పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో సీఐ అంతకంటే పైస్థాయి అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రౌడీషీటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సంబంధిత స్టేషన్‌ సీఐలను ఆరా తీశారు. అలాగే ట్రాఫిక్‌, నేరపరిశోధన, శాంతి భద్రతల విభాగానికి సంబంధించిన కేసులను సమీక్షించారు. పెండింగ్‌ కేసులపై సంబంధిత దర్యాప్తు అధికారులను వివరణ అడిగారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీపీ ఆదేశించారు. నగరంలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టడానికి ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసుకోవాలని స్పష్టంచేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు, వాటిపై కేసులు నమోదుచేస్తున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. నగరంలోకి నేరస్థులు, సంఘవిద్రోహులు, ఉగ్రవాదులు చొరబడితే వెంటనే వారిని గుర్తించేందుకు వీలుగా విజిటర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (వీఎంఎస్‌)ను వినియోగించుకోవాలని సూచించారు. మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వేధింపులు, మిస్సింగ్‌ కేసుల నమోదు, దర్యాప్తులో జాప్యం జరిగితే సహించేది లేదని స్పష్టంచేశారు. కోర్టులో కేసులు పెండింగ్‌ లేకుండా చూడడంతోపాటు శిక్ష పడే కేసుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. వచ్చేనెల నిర్వహించే సమీక్షకు అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకున్నట్టు నిరూపించుకోవాలన్నారు. పోలీసులు ఎవరైనా అవినీతికి పాల్పడినా, నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తించినా, రౌడీషీటర్లు, నేరస్థులకు సహకరిస్తున్నట్టు తెలిసినా కఠినచర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీలు అజితావేజెండ్ల, మేరీప్రశాంతి, లతా మాధురి ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 01:29 AM