Share News

బియ్యం ఎగుమతులపై నిఘా

ABN , Publish Date - Jun 27 , 2025 | 01:02 AM

రేషన్‌ బియ్యం నగరంలోని పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్టు సమాచారం అందుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.

బియ్యం ఎగుమతులపై నిఘా

పోర్టు ద్వారా రేషన్‌ బియ్యం విదేశాలకు వెళ్లకుండా నియంత్రించేందుకు టాస్క్‌ ఫోర్స్‌

పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్‌, పోర్టు అధికారులతో ఏర్పాటు

బియ్యం టెస్టింగ్‌కు పోర్టులోనే లేబొరేటరీ...

విశాఖపట్నం, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

రేషన్‌ బియ్యం నగరంలోని పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్టు సమాచారం అందుతుండడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్‌, పోర్టు అధికారులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కలెక్టర్‌ నేతృత్వంలో అధికారులతో ఒక సమావేశం నిర్వహించనున్నారు.

పౌర సరఫరాల మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు అధికారులు మంగళ, బుధవారాల్లో కంటెయినర్‌ ఫ్రైట్‌ స్టేషన్లపై దాడులు చేసి 473 టన్నుల బియ్యం పట్టుకున్న సంగతి తెలిసిందే. వాటి నుంచి నమూనాలను సేకరించి టెస్టింగ్‌కు లేబొరేటరీకి పంపారు. ఆ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందినవా?, కాదా?...అనేది ఒకటి, రెండు రోజుల్లో తేలనున్నది. గత ఏడాది కాకినాడ పోర్టులో పీడీఎస్‌ బియ్యం భారీగా పట్టుకున్నారు. కాకినాడ పోర్టుపై నిఘా ముమ్మరం చేయడంతో రేషన్‌ బియ్యాన్ని ఎగుమతి చేసే వ్యాపారులంతా విశాఖ పోర్టును తమ కార్యస్థానంగా మార్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ గత ఏడాది ఒకసారి పోర్టు నుంచి ఎగుమతులు చేసే కంటెయినర్‌ ఫ్రైట్‌ స్టేషన్లలో తనిఖీలు చేసి రెండుచోట్ల బియ్యం పట్టుకున్నారు. ఒక చోట పట్టుకున్న బియ్యం చౌక డిపోల నుంచి వచ్చినవేనని నిర్ధారణ కావడంతో కేసు నమోదుచేయించారు.

విశాఖ పోర్టు నుంచి రేషన్‌ బియ్యం ఎగుమతులు కొనసాగుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో నిరంతరం పోర్టులో పనిచేసేలా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఏపీలో చౌక డిపోల్లో ఫోర్టిఫైడ్‌ బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి విశాఖ పోర్టుకు తీసుకువస్తే వెంటనే నిర్ధారించవచ్చు. అదే ఛత్తీస్‌గఢ్‌లో కొన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్‌ రైస్‌ను, మరికొన్ని జిల్లాల్లో సాధారణ బియ్యం అందిస్తున్నారు. సాధారణ బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేసిందో, కాదో...నిర్ధారించడం వెంటనే సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. వాటిని లేబొరేటరీకి పంపితే కొంతవరకూ గుర్తించవచ్చునంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ పోర్టు పరిధిలోనే బియ్యం టెస్టింగ్‌ లేబొరేటరీ ఒకటి ఏర్పాటుచేయాలని యోచిస్తున్నారు. పోర్టు నుంచి రేషన్‌ బియ్యం రవాణాను పూర్తిగా అరికట్టేలా నిఘా ముమ్మరం చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. త్వరలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసి పోర్టు నుంచి రేషన్‌ బియ్యం ఎగుమతులకు అడ్డుకట్ట వేస్తామన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 01:02 AM