Share News

మసాజ్‌ సెంటర్‌లపై నిఘా

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:26 AM

నగరంలో మసాజ్‌ సెంటర్లు, లాడ్జిలపై పోలీసులు నిఘా పెంచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే ఫిర్యాదులు అందుతుండడంతో సీపీ శంఖబ్రతబాగ్చీ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

మసాజ్‌ సెంటర్‌లపై నిఘా

లాడ్జిలపై కూడా...

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని ఫిర్యాదులు

ఆకస్మిక తనిఖీలకు సీపీ ఆదేశం

ఒక స్టేషన్‌ పరిధిలో వేరొక స్టేషన్‌ పోలీసులతో దాడులు

బయటపడుతున్న చీకటి కార్యకలాపాలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో మసాజ్‌ సెంటర్లు, లాడ్జిలపై పోలీసులు నిఘా పెంచారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే ఫిర్యాదులు అందుతుండడంతో సీపీ శంఖబ్రతబాగ్చీ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఒక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హోటళ్లు/లాడ్జిలు, మసాజ్‌ సెంటర్లపై వేరొక స్టేషన్‌ పరిధిలోని పోలీసులతో ఆకస్మిక దాడులు చేయిస్తున్నారు. వారికి అదనంగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టడంతో ఇటీవల కాలంలో వరుసగా చీకటి కార్యకలాపాలు బయటపడుతున్నాయి.

ఇటీవల కాలంలో థాయ్‌ స్పా, ఆయుర్వేదిక్‌ స్పా సెంటర్లు బాగా పెరిగిపోయాయి. ఒక మసాజ్‌ సెంటర్‌లో పనిచేసినవారు అక్కడ యజమానులకు వచ్చే ఆదాయాన్ని చూసి తాము కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభిస్తున్నారు. కొంతమంది కస్టమర్లతో పరిచయాలు పెంచుకున్న తర్వాత సొంత దుకాణం తెరుస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 350కి పైగా మసాజ్‌ సెంటర్లు ఉన్నాయి. కాస్మోటిక్‌ అండ్‌ బ్యూటీషియన్‌ యాక్ట్‌కు లోబడిన సేవలను మాత్రమే మసాజ్‌ సెంటర్లలో అందజేయాలి. సెంటర్‌ ఏర్పాటుతోపాటు లోపల సదుపాయాల కల్పన కూడా యాక్ట్‌లో పేర్కొన్నట్టుగానే ఉండాలి. కానీ మసాజ్‌ సెంటర్ల నిర్వాహకులు మాత్రం స్పాల్లో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహించి కస్టమర్ల నుంచి భారీగా డబ్బులు వసూలుచేస్తున్నారు. పోలీసులతో తాము అవగాహన ఏర్పరచుకున్నందున దాడుల భయం ఉండదని కస్టమర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ తరహా వ్యవహారాలు జరుగుతున్నట్టు తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే నగరంలోని కొన్ని హోటళ్లు/లాడ్జిల్లో పేకాట, వ్యభిచారం నడుస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపకపోతే సమస్య మరింత తీవ్రంగా మారి నగరంలో శాంతిభద్రతల సమస్యకు దారితీయడం ఖాయమని గుర్తించిన సీపీ శంఖబ్రతబాగ్చి హోటళ్లు/లాడ్జిలు, మసాజ్‌ సెంటర్లపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌ పరిధిలో మసాజ్‌ సెంటర్లు, హోటళ్లు/లాడ్జిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారిదేనని, ఏదైనా తేడా వస్తే అందుకు బాధ్యుడిని చేస్తానని సీపీ హెచ్చరించారు. అంతేగాకుండా ఒక స్టేషన్‌ పరిధిలోని హోటళ్లు/లాడ్జిలు, మసాజ్‌ సెంటర్లపై మరొక పోలీస్‌స్టేషన్‌ అధికారులు, సిబ్బందితో ఆకస్మిక దాడులు చేయిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇదే తరహాలో ఆకస్మిక సోదాలు జరుగుతుండడంతో వరుసగా చీకటి కార్యకలాపాలు బయటపడుతున్నాయి. కొద్దిరోజుల కిందట నగరంలోని ఒక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు బయటపడగా, మరో స్టేషన్‌ పరిధిలోని మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం గుట్టురట్టయింది. తాజాగా నగర శివారునున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక మసాజ్‌ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్టు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితోపాటు ఒక విటుడిని, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులు కొనసాగుతాయని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Sep 23 , 2025 | 01:26 AM