మద్యం దుకాణాలపై నిఘా
ABN , Publish Date - Jun 01 , 2025 | 12:20 AM
జిల్లాలోని మద్యం దుకాణాల వద్ద పర్యవేక్షణ కట్టుదిట్టం చేస్తున్నారు. అన్ని షాపులకు సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులలో మద్యం లూజ్ విక్రయాలు చేయకూడదు. ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లకు మించి ఇవ్వకూడదు. మద్యం బాటిల్ మీద ఉన్న నిర్ణీత ధర కంటే అధిక ధరకు విక్రయించకూడదు. ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉన్న కారణంగా మద్యం షాపుల పర్యవేక్షణ ఎక్సైజ్ అధికారులకు కష్టతరంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు.
- ఒక్కో షాపు వద్ద నాలుగు సీసీ కెమెరాల ఏర్పాటు
- జిల్లాలో 8 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 161 షాపులు
- అమరావతి, అనకాపల్లిలో కంట్రోల్ రూమ్‌లు
- కంట్రోల్ రూమ్ నుంచి పబ్లిక్ ఐపీ ద్వారా పర్యవేక్షణ
నర్సీపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మద్యం దుకాణాల వద్ద పర్యవేక్షణ కట్టుదిట్టం చేస్తున్నారు. అన్ని షాపులకు సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులలో మద్యం లూజ్ విక్రయాలు చేయకూడదు. ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లకు మించి ఇవ్వకూడదు. మద్యం బాటిల్ మీద ఉన్న నిర్ణీత ధర కంటే అధిక ధరకు విక్రయించకూడదు. ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉన్న కారణంగా మద్యం షాపుల పర్యవేక్షణ ఎక్సైజ్ అధికారులకు కష్టతరంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. జిల్లాలో నర్సీపట్నం, గొలుగొండ, వి.మాడుగుల, చోడవరం, పాయకరావుపేట, ఎలమంచలి, సబ్బవరం, అనకాపల్లి ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 161 ప్రైవేటు వైన్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క దుకాణానికి నాలుగు చొప్పున సీసీ కెమెరాలు అమర్చాలి. ఇప్పటికే151 షాపులకు సీసీ కెమెరాలు అమర్చారు. మిగిలిన పది షాపులలో కూడా అమరుస్తున్నారు. అన్ని షాపుల వద్ద బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి చేశారు. పబ్లిక్ ఐపీ (ఇంటర్నెట్ ప్రొటోకాల్)ద్వారా వైన్ షాపుల పర్యవేక్షణ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో అమరావతి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో అనకాపల్లిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఐపీ లింక్‌తో ఎక్సైజ్ సీఐలు కూడా పర్యవేక్షణ చేయవచ్చు. ఎక్సైజ్ స్టేషన్లకు టీవీ మోనిటర్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులో మద్యం షాపులో విక్రమించే ప్రతీ బాటిల్‌ని స్కాన్ చేసే అవకాశం ఉంది. డిపో లోంచి మద్యం స్టాక్ ఎంత తీసుకొచ్చారు?, ఎంత విక్రయించారు? అనే సమాచారం అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం పబ్లిక్ ఐపీ ద్వారా రెండు షాపులను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఒక వారం రోజుల్లో 50 శాతం షాపులు కంట్రోల్ రూమ్ పరిధిలోకి వచ్చేస్తాయి. జూన్ నెలాఖరులోగా జిల్లాలోని అన్ని మద్యం షాపులు కంట్రోల్ రూమ్ పర్యక్షణలోకి వస్తాయని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సర్జిత్‌సింగ్ తెలిపారు.