Share News

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:05 AM

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సహకరించాలని పోర్టు, కస్టమ్స్‌ అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ కోరారు.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా

  • పోర్టు, కస్టమ్స్‌ అధికారులకు పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూచన

విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు సహకరించాలని పోర్టు, కస్టమ్స్‌ అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్‌ కోరారు. మంగళవారం సాయంత్రం ఆయన నోవాటెల్‌ హోటల్‌లో పోర్టు, కస్టమ్స్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉన్న పీడీఎస్‌ బియ్యాన్ని ఇటీవల పట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. పోర్టు నుంచి పీడీఎస్‌ బియ్యం రవాణాను నిలిపివేయాలన్నారు. ఇందుకు నిఘా ముమ్మరం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, పోర్టు, కస్టమ్స్‌ కలిసి సంయుక్తంగా తనిఖీలు చేయాలన్నారు. దీనికి పోస్టు కార్యదర్శి వేణుగోపాల్‌ మాట్లాడుతూ పోర్టు నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని, రేషన్‌ బియ్యం స్టోరేజీకి అనుమతి ఇవ్వొద్దని ఫ్రైట్‌ స్టేషన్లకు సూచనలు చేస్తామన్నారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌరబ్‌గౌర్‌, జేసీ మయూర్‌ అశోక్‌ పాల్గొన్నారు.


ఒడిశా నుంచి ఫిషింగ్‌ బోట్‌ ఇంజన్ల అక్రమ రవాణా

బిల్లులు లేవని స్వాధీనం చేసుకున్న వాణిజ్య పన్నుల శాఖ

విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలో మత్స్యకారులకు అక్కడి ప్రభుత్వం రాయితీ ధరపై అందిస్తున్న బోటు ఇంజన్లను కొందరు అక్రమంగా శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. ఇది చాలా కాలంగా జరుగుతోంది. దీనిపై ఒడిశాలో పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు వాహనాలు బోటు ఇంజన్లతో ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చాయని విశ్వసనీయ సమాచారం అందడంతో వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్‌టీ) అధికారులు కాపు కాచి తనిఖీలు చేయగా రెండు రోజుల క్రితం ఒకటి పట్టుబడింది. అందులో మూడు బోటు ఇంజన్లు ఉండగా, వాటిలో రెండింటికి బిల్లులు లేవు. దాంతో ఆ వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని ఆరిలోవలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి తరలించారు. మరో వాహనం శ్రీకాకుళం జిల్లాలో ఇంజన్లను డెలివరీ చేసినట్టు తెలిసింది. గ్రీవ్స్‌ కంపెనీ ఈ ఇంజన్లను సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ఒడిశాలో మత్స్యకారుల వద్ద దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని ఏపీకి తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు సమాచారం. విశాఖతో పాటు అనకాపల్లి జిల్లా నక్కపల్లి, అచ్యుతాపురం ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు వీటిని కొనుగోలు చేస్తుంటారని తెలిసింది. పెద్ద సంఖ్యలో ఈ ఇంజన్లు ఇక్కడికి రావడం వల్ల తమ వ్యాపారం తగ్గిపోయిందని గుర్తించిన వ్యాపారులే అక్రమ రవాణా సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందించినట్టు తెలిసింది.

జరిమానా వేసి విడిచిపెట్టాం

శ్రీనివాసరావు, ఇంటెలిజెన్స్‌ అధికారి, వాణిజ్య పన్నుల శాఖ

బిల్లులు లేకుండా బోటు ఇంజన్లు వస్తున్నాయని సమాచారం రాగా తనిఖీలు నిర్వహించి ఒక వాహనాన్ని పట్టుకున్నాం. అందులో మూడు ఇంజన్లు ఉండగా, ఒక దానికే బిల్లు ఉంది. మిగిలిన రెండింటికి బిల్లులు లేవు. కార్యాలయానికి వాహనాన్ని తీసుకువచ్చాక, జరిమానా వేసి విడిచి పెట్టాం.


నగరం నిప్పులకొలిమి

ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి

విశాఖపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఒకప్పుడు నడివేసవి కాలంలోనూ సాయంత్రానికి చల్లగాలులు వీచేవి. ఈదురుగాలులతో వర్షం కురిసేది. అటువంటిది వర్షాకాలంలో శ్రావణమాసంలో మాడుపగిలే ఎండ కాస్తోంది. రోజుల తరబడి వర్షం జాడలేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేడి వాతావరణం కొనసాగుతోంది. ఎండకు భయపడి బయటకు రావాలంటే ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా భూమి నుంచి వేడి సెగలు వస్తున్నాయి. వర్షాకాలంలో ఉండాల్సిన చల్లదనం మచ్చుకైనా కానరావడం లేదు. మంగళవారం గాలులు వేగం మందగించడంతో వేడి మరింత పెరిగి నగరం నిప్పుల కొలిమిలా మారింది. వాతావరణ శాఖ అఽధికారులకు కూడా ఈ వాతావరణం అంతుచిక్కడం లేదు. ప్రతిరోజు నగరంలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఇస్తున్న బులెటిన్లు తప్పు అవుతున్నాయి. మరికొన్నాళ్లు ఈ వేడి భరించాల్సి వచ్చేలా ఉంది.

Updated Date - Aug 06 , 2025 | 01:05 AM