నివాస ప్రాంతాల్లోనూ నిఘా నేత్రాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:38 AM
పట్టణంలోని నివాస ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లో ఇప్పటికే పలుచోట్ల సీసీ కెమెరాలు బిగించగా.. ఇప్పుడు గవరపాలెం ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గవరపాలెంలో 80 సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసు శాఖ నిర్ణయం
వివిధ ప్రదేశాలను పరిశీలించిన సీఐ, ఎస్‌ఐలు
అనకాపల్లి టౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని నివాస ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధాన రహదారుల్లో ఇప్పటికే పలుచోట్ల సీసీ కెమెరాలు బిగించగా.. ఇప్పుడు గవరపాలెం ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎంపీ సీఎం రమేశ్ ‘ఎంపీ ల్యాడ్స్’ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో వివిధచోట్ల సుమారు 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. వీటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై పట్టణ పీఎస్ సీఐ జి.ప్రేమ్‌కుమార్, ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు గురువారం గవరపాలెం ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ముఖ్యమైన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు వారు తెలిపారు.