అన్నదాతలకు అండగా!
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:33 PM
అన్నదాతకు అండగా ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి దన్‌ధాన్య కృషి యోజనకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎంపికైంది.
వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి
‘పీఎం దన్‌ధాన్య కృషి యోజన’ను ప్రవేశపెట్టిన కేంద్రం
ఈ పథకానికి అల్లూరి జిల్లా ఎంపిక
జిల్లాలో రెండు లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
అన్నదాతకు అండగా ఉండాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి దన్‌ధాన్య కృషి యోజనకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎంపికైంది. వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల్లో వెనుకబాటులో ఉన్న దేశ వ్యాప్తంగా 100 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు స్థానం కల్పించారు. ఈ పథకంలో రానున్న ఆరేళ్లలో వ్యవసాయాభివృద్ధికి రూ.42వేల కోట్లను వ్యయం చేస్తారు. ఈపథకం అమలుతో జిల్లాలోని 22 మండలాల్లో రెండు లక్షల గిరిజన రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా వ్యవసాయాభివృద్ధికి అవసరమైన పంట మార్చిడి విధానాలు, కల్తీ విత్తనాల బెడద తొలగింపు, సాగు నీటి సదుపాయాల కల్పన, రైతులకు స్వల్పకాలిక రుణాలు, దిగుబడులు పెంచే సలహాలు, సూచనలు, మార్కెటింగ్, సాగులో వైవిద్యం, ఉత్పాదకత పెంపు, ఆహార ఉత్పత్తుల ప్రోసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటు, మత్స్య, పశుసంవర్థక శాఖల్లోనూ వినూత్న మార్పులు తీసుకువస్తారు. అనంతరం రైతులు ఆర్థికంగా బలపడతారనేది ఈ పథకం ప్రధాన లక్ష్యం.