Share News

కళ తప్పిన సూపర్‌బజార్లు

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:15 PM

గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధ్వర్యంలో నెలకొల్పిన సూపర్‌బజార్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు నిత్యం వాపార కార్యకలాపాలతో దేదీప్యమానంగా వెలుగొందిన సూపర్‌బజార్లు నిర్వహణకు తగిన ఆర్థిక సర్దుబాటు లేక మూసి వేస్తున్నారు.

కళ తప్పిన సూపర్‌బజార్లు
కొన్ని నెలలుగా మూతపడి ఉన్న కొయ్యూరు జీసీసీ సూపర్‌బజార్‌

నిర్వహణ లేమితో ఒక్కొక్కటిగా మూసివేత

కొయ్యూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆధ్వర్యంలో నెలకొల్పిన సూపర్‌బజార్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు నిత్యం వాపార కార్యకలాపాలతో దేదీప్యమానంగా వెలుగొందిన సూపర్‌బజార్లు నిర్వహణకు తగిన ఆర్థిక సర్దుబాటు లేక మూసి వేస్తున్నారు.

జీసీసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వీలుగా రెండున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతీ బ్రాంచీ పరిధిలో గల ప్రధాన సెంటర్లలో రెండు లేదా మూడు సూపర్‌బజార్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా గిరిజనులకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అందుబాటు ధరలకు విక్రయించేవారు. దీంతో పాటు అటవీ ఉత్పత్తుల కొనుగోలు, జీసీసీ ఆధ్వర్యంలో తయారైన తేనె, పసుపు, షీకాయ, సబ్బులు, తదితర వస్తువులు వీటి ద్వారా అమ్మకాలు జరిపేవారు. ఒక్కో బ్రాంచీ పరిధిలో నెలలో లక్షలాది రూపాయల టర్నోవర్‌ జరిగేది. దీంతో జీసీసీకి లాభాలు బాగానే వచ్చేవి. అయితే గత 10 సంవత్సరాలుగా కొంత మంది సిబ్బంది చేతివాటం వలన ఆదాయం పక్కదారి పట్టింది. కొన్ని బ్రాంచీల్లో తగినంత సిబ్బంది లేక వ్యాపారం తగ్గుముఖం పట్టింది. అమ్మకాలు జరగక సరుకులు కాలం చెల్లిపోవడం, సిబ్బంది పట్టించుకోకపోవడంతో నష్టాల బాట పట్టింది. కృష్ణాదేవిపేటలోని సూపర్‌బజార్‌లో పూర్తి స్థాయిలో నిత్యావసర సరుకులు ఏర్పాటు చేసే ఆర్థిక స్థోమత లేక వెలవెలబోతోంది. ఒకప్పుడు పండుగల సీజన్‌లో సూపర్‌ బజార్లలో నిత్యావసర సరుకులతో పాటు దుస్తులు, గృహోపకరణాలు, తదితర సామగ్రి విక్రయించేవారు. ప్రస్తుతం నిత్యావసర సరుకులు సైతం స్టాక్‌ పెట్టలేని దీన స్థితికి సూపర్‌బజార్లు చేరాయి. వీటి కోసం లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి సూపర్‌బజార్లకు పూర్వవైభవం తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:15 PM