Share News

ఎండ..వాన

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:55 AM

నగరంలో గురువారం భిన్న వాతావరణం నెలకొంది. తూర్పు, ఈశాన్య భాగాల్లో వర్షం కురవగా, మిగిలిన ప్రాంతాల్లో ఎండ కొనసాగింది.

ఎండ..వాన

మధ్యాహ్నం వరకూ నిప్పులకొలిమిలా మారిన నగరం

ఎయిర్‌పోర్టులో 38.4 డిగ్రీలు

మూడు గంటల తరువాత ఈదురుగాలులతో వర్షం

అది కూడా మద్దిలపాలెం నుంచి మధురవాడ వరకే...

జాతరలో 54.25 మి.మీ.వర్షపాతం

విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి):

నగరంలో గురువారం భిన్న వాతావరణం నెలకొంది. తూర్పు, ఈశాన్య భాగాల్లో వర్షం కురవగా, మిగిలిన ప్రాంతాల్లో ఎండ కొనసాగింది. మద్దిలపాలెం నుంచి మధురవాడ వరకూ ఈదురుగాలులతో వర్షం కురిసింది. అనేకచోట్ల చెట్లు నేలకొరిగాయి. గడచిన మూడు, నాలుగు రోజుల నుంచి నగరంలో తీవ్రమైన ఎండ, ఉక్కపోత కొనసాగుతున్నాయి. గురువారం కూడా ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉంది. కొద్దిసేపు వడగాడ్పులు వీచాయి. మధ్యాహ్న సమయానికి నగరం నిప్పులకొలిమిలా మారింది. ఫ్యాన్‌ల కింద కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఎయిర్‌పోర్టులో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే మధ్యాహ్నం మూడు గంటల తరువాత ఒక్కసారిగా నగరం, పరిసరాల్లో మేఘాలు ఆవరించాయి. ఈదురుగాలులు వీచాయి. మధురవాడ, ఎండాడ, విశాలాక్షి నగర్‌, ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 45 నిమిషాలసేపు వర్షం కురిసింది. మధురవాడ జాతరలో 54.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే విచిత్రంగా సత్యం జంక్షన్‌ నుంచి...ఇటు ఎన్‌ఏడీ వైపు చినుకులేదు. అక్కయ్యపాలెం, కంచరపాలెం, మిగిలిన ప్రాంతాల్లో గాలులు తప్ప వర్షం పడలేదు.


వెంకోజీపాలెం సర్వీస్‌ రోడ్డులోఆక్రమణల తొలగింపు

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి):

వెంకోజీపాలెం జంక్షన్‌ నుంచి ఇసుకతోట జంక్షన్‌ వరకూ సర్వీస్‌ రోడ్డులోని ఆక్రమణల తొలగింపునకు జీవీఎంసీ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురవ్వడంపై ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టౌన్‌ప్లానింగ్‌ అధికారులు స్పందించారు. సర్వీస్‌ రోడ్డుపై పాత ఇంటి సామగ్రి, ఇతర సామగ్రి పెట్టిన వారి దుకాణాల వద్దకు వెళ్లి వాటిని తొలగించాలని గురువారం ఆదేశించారు. వారు స్పందించకపోవడంతో జీవీఎంసీ సిబ్బందే గూడ్స్‌ ఆటోల్లో సామగ్రిని అక్కడ నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గురువారం కొంతవరకూ తొలగించారు. మిగిలిన వాటిని శుక్రవారం తొలగించాలని భావిస్తున్నారు. అయితే ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు మొదలైనట్టు తెలిసింది. వాటిని అధిగమించి ఆక్రమణలు తొలగిస్తారా?, లేక ఒత్తిళ్లకు తలొగ్గుతారా?...అనేది వేచి చూడాల్సిందే.

Updated Date - Jun 06 , 2025 | 12:55 AM