Share News

భానుడు భగ భగ

ABN , Publish Date - May 13 , 2025 | 01:32 AM

అగ్నికార్తెలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.

భానుడు భగ భగ

ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు

వడగాడ్పులు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు

ఇళ్ల నుంచి బయటకురావడానికి వెనకడుగు

మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారిన రహదారులు

అనకాపల్లి టౌన్‌/ నర్సీపట్నం/ ఎలమంచిలి/ కోటవురట్ల, మే 12 (ఆంధ్రజ్యోతి):

అగ్నికార్తెలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. కార్తె రెండు రోజుల క్రితం ప్రారంభంకాగా మొదటి రోజే ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండ తీక్షణంగా కాసింది. వడగాడ్పులకుతోడు గాలిలో తేమశాతం అధికంగా వుండడంతో విపరీతమైన ఉక్కపోత నెలకొంది. మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వివిధ పనుల నిమిత్తం ఇళ్లనుంచి బయటకు వచ్చిన వారు ఎండబారిన పడకుండా పలుజాగ్రత్తలు తీసుకున్నారు. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు పలుచోట్ల మధ్యాహ్నం సొమ్మసిల్లిపోయి చెట్ల కింద సేదతీరాల్సి వచ్చింది. జిల్లాలో అత్యధిక మండలాల్లో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైబడి నమోదయ్యాయి. అత్యధికంగా గొలుగొండ మండలంలో 41.8 డిగ్రీలు నమోదుకాగా, వాతావరణంలో నెలకొన్న అనిశ్చితితో సాయంత్రం ఈదురు గాలులు, పిడుగులతో వర్షం కురిసింది.

అనకాపల్లిలో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డులో జనసంచారం బాగా తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చిన ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెరకు రసం, రస్సీ, ఫ్రూట్‌జ్యూస్‌, శీతలపానీయాల అమ్మకాలు పెరిగాయి. మంగళవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నర్సీపట్నంలో..

భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోయారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత సుమారు మూడు డిగ్రీలు పెరిగింది. మధ్యాహ్నం సమయంలో 39 డిగ్రీలకుపైబడి నమోదు కావడంతో వేడిని తట్టుకోలేక చిన్న పిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత కనిపించింది. దీనికితోడు ఉక్కపోత, వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎలమంచిలిలో..

ఎలమంచిలి పట్టణంలోని పలు రహదారులు సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యమారి కర్ఫ్యూని తలపించాయి. భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండచుర్రుమనిపించడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి వెనుకంజ వేశారు. మెయిన్‌ రోడ్డుతోపాటు పలు రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వాణిజ్య, వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులు లేక బోసిపోయాయి. ఉక్కపోతతో ఇళ్లల్లో ఉండలేక ఆవరణల్లోని చెట్ల కింద సేదతీరారు. దూర ప్రాంతాలకు సరకు రవాణా చేసే లారీలను జాతీయ రహదారి పక్కన చెట్ల నీడలో నిలుపుదల చేసి, డ్రైవర్లు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం వేడి తగ్గిన తరువాత ప్రయాణాన్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.

Updated Date - May 13 , 2025 | 01:32 AM