సమ్మర్ ట్రిప్స్ క్యాన్సిల్
ABN , Publish Date - May 13 , 2025 | 01:21 AM
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

యుద్ధ నేపథ్యంలో ప్రయాణాలు రద్దు
ఊటీ, కాశీ వంటి చోట్లకు వెళ్లేందుకు కూడా వెనుకంజ
పరిస్థితులు కుదురుకున్నాకు వెళ్లవచ్చుననే యోచనలో అత్యధికులు
టికెట్ల క్యాన్సిలేషన్‌కు ప్రత్యేకంగా కోడ్ ఇచ్చిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సీజన్ కావడంతో అనేక కుటుంబాలు ముందుగానే ‘సమ్మర్ ట్రిప్’నకు ప్రణాళికలు వేసుకొని విమాన, రైలు టికెట్లతో పాటు పర్యటించే ప్రాంతాల్లో హోటల్ రూమ్‌లు కూడా బుక్ చేసుకున్నాయి. అయితే పహల్గాంలో పర్యాటకులనే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు చేయడంతో కశ్మీర్, శ్రీనగర్, వైష్ణోదేవి ఆలయ సందర్శనకు వెళ్లాలనుకున్న వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఆ తరువాత రెండు దేశాల మధ్య యుద్ధం మొదలుకావడంతో దేశంలోని 15 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీంతో చాలామంది తమ టూర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కశ్మీర్ పర్యటనకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. పొరుగునే తమిళనాడు రాష్ట్రంలో ఊటీ వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్న వారు సైతం వాటిని రద్దు చేసుకుంటున్నారు. అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు లేవని, సంతోషంగా వెళ్లి రావచ్చునని ట్రావెల్ ఏజెన్సీలు నచ్చజెప్పడానికి యత్నిస్తున్నా ముందుకురావడం లేదు. బిక్కుబిక్కుమంటూ అంతంత దూరం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోలేమని, టికెట్లు రద్దు చేయాలని ఒత్తిడి పెట్టడంతో ఏజెన్సీలు ఇక తప్పదని డబ్బులు వెనక్కి ఇస్తున్నాయి.
కాశీ వెళ్లాలన్నా ఆందోళనగా ఉంది
ముప్పిడి శ్రీనివాసరావు, సీతంపేట
ఐదు కుటుంబాలు కలిసి ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు కాశీ పర్యటన కోసం రైలు టికెట్లు, అక్కడ హోటల్ రూమ్‌లు బుక్ చేసుకున్నాము. ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలపైనే పాకిస్థాన్ దాడులు చేసే అవకాశం ఉందని వార్తాకథనాలు వినిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాలకు కొంత కాలం వెళ్లకుండా ఉండడమే మంచిదని కూడా సూచిస్తున్నారు. దాంతో కాశీ పర్యటన రద్దు చేసుకుంటున్నాము. పరిస్థితులు కుదురుకున్నాక మరోసారి వెళదామని నిర్ణయించుకున్నాము.
కోడ్ ఇవ్వడంతో టిక్కెట్ల రద్దు
కె.విజయమోహన్, అధ్యక్షులు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్.
దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంతో 15 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు. దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టికెట్లు బుక్ చేసుకున్నవారికి ప్రత్యేకంగా ‘కోడ్’ ఇచ్చింది. దానిని ఉపయోగించుకొని టికెట్లు రద్దు చేసుకుంటే డబ్బులు వాపస్ ఇస్తామని వెల్లడించింది. దాంతో గత మూడు రోజుల్లో మా సంస్థలోనే 300 మంది టికెట్లు రద్దు చేసు కున్నారు. దేశీయ పర్యాటక రంగంపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపిస్తోంది.