ఆర్టీసీకి సమ్మర్ కిక్
ABN , Publish Date - May 12 , 2025 | 12:05 AM
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు వేసవి కాలం కలిసొచ్చింది. ప్రయాణికుల తాకిడి అధికం కావడంతో అందుకు అనుగుణంగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరిగింది.
20 శాతం పెరిగిన ప్రయాణికులు
పెరిగిన ఓఆర్, ఆదాయం
రోజుకు సుమారు రూ.99 లక్షల ఆదాయం వస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్న అధికారులు
ద్వారకాబస్‌స్టేషన్, మే 11 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు వేసవి కాలం కలిసొచ్చింది. ప్రయాణికుల తాకిడి అధికం కావడంతో అందుకు అనుగుణంగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెరిగింది. ఈ రెండింటి ప్రభావంతో ఆదాయం కూడా పెరిగింది. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు మంచిరోజులు వచ్చాయని అధికారులు, సిబ్బంది సంబరపడుతున్నారు. విశాఖ రీజియన్ పరిధిలోని మధురవాడ, మద్దిలపాలెం, విశాఖపట్నం, వాల్తేరు, సింహాచలం, గాజువాక, స్టీల్ సిటీ డిపోల్లో 814 బస్సులు ఉన్నాయి. ఇవి రోజుకు సుమారు రెండున్నర లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ 5.44 లక్షల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తున్నాయి.
పెరిగిన ప్రయాణికులు
ఈ ఏడాది సమ్మర్‌లో ఆర్టీసీకి ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రోజుకు 5.44 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి రోజువారీ ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ ఏప్రిల్ నెలాఖరు నాటికి ఆ సంఖ్య 6.8 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు అదే సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. ఇది సాధారణ రోజుల ప్రయాణికుల సంఖ్య కంటే 20 శాతం ఎక్కువ. ఇంతకు మునుపెన్నడూ ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల లేదని ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు చెబుతున్నారు. వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడం, విద్యా సంస్థలకు సెలవులు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజ్ఞాన విహార యాత్రలకు రాకపోకలు సాగిస్తుండడం, ఇంకొందరు పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లి వస్తుండడంతో ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతుండడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
పెరిగిన ఓఆర్, ఆదాయం
విశాఖ రీజియన్‌లో ప్రయాణికుల సంఖ్య పెరిగిన కారణంగా ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. మొత్తం 814 బస్సులో 5.44 లక్షల మంది ప్రయాణించినప్పుడు సగటు ఆక్యుపెన్సీ రేషియో 57 శాతంగా ఉంది. ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి ఇవే బస్సుల్లో 6.8 లక్షల మంది ప్రయాణించడంతో సగటు ఆక్యుపెన్సీ రేషియో 67 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఇదే ఓఆర్ కొనసాగుతున్నది. రోజువారీ ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. మార్చి నెలాఖరు వరకు సగటున రోజువారీ ఆదాయం రూ.88 లక్షలు ఉంది. అయితే ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు సగటున రోజువారీ ఆదాయం రూ.99 లక్షలు వస్తుందని అధికారులు పేర్కొన్నారు.