Share News

నాణ్యమైన కాఫీకి వేసవి సస్యరక్షణ కీలకం

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:25 PM

మన్యంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటల్లో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు వేసవి సస్యరక్షణ చాలా కీలకమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది కాఫీ తోటల్లో కాఫీ పూత ఆశాజనకంగా ఉందని, రైతులు సస్యరక్షణ చర్యలు సక్రమంగా చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు. దీనిపై రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

నాణ్యమైన కాఫీకి వేసవి సస్యరక్షణ కీలకం
ఎండు కొమ్మలను తొలగిస్తున్న గిరిజన మహిళలు

జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు

ఎండు, పొడవైన కొమ్మలు తొలగించుకోవాలి

ఈ ఏడాది ఆశాజనకంగా కాఫీ పూత

రైతులకు ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు

చింతపల్లి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మన్యంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటల్లో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు వేసవి సస్యరక్షణ చాలా కీలకమని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది కాఫీ తోటల్లో కాఫీ పూత ఆశాజనకంగా ఉందని, రైతులు సస్యరక్షణ చర్యలు సక్రమంగా చేపడితే నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని అంటున్నారు. దీనిపై రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సంప్రదాయేతర ప్రధాన వాణిజ్య పంటగా కాఫీ సాగు చేపడుతున్నారు. జిల్లాలో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేపడుతున్నారు. ఎకరానికి 500- 600 కిలోల కాఫీ పండ్ల నుంచి 100 కిలోల క్లీన్‌ కాఫీ సాధిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రైతులు ఎకరానికి 1400- 1500 కిలోల కాఫీ పండ్ల నుంచి 300 కిలోల క్లీన్‌ కాఫీ దిగుబడులు పొందుతున్నారు. గిరిజన ప్రాంతంలో 300 కిలోల క్లీన్‌ కాఫీ సాధించే రైతులు పదుల సంఖ్యలో మాత్రమే ఉన్నారని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఆదివాసీ రైతులు కాఫీ సాగులో వేసవి సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ఆశించిన దిగుబడి పొందలేకపోతున్నారు. ప్రస్తుతం రైతులు తోటల్లో కాఫీ పండ్ల కోత పనులు పూర్తిచేసుకున్నారు. తొలకరి వర్షాలు కూడా కురవడంతో కాఫీ మొక్కల్లో పూత కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలో వేసవిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ఫైర్‌లైన్‌ క్లియరెన్స్‌

వేసవిలో కాఫీ తోటలు అగ్నిప్రమాదానికి గురికాకుండా రైతులు ఫైర్‌లైన్‌ క్లియరెన్స్‌ పనులను చేసుకోవాలి. కాఫీ తోట నలుదిక్కులా ఎండిపోయిన ఆకులు, కొమ్మలను తొలగించుకోవాలి. కనీసం కాఫీ తోటల అంచుల చుట్టూ మూడు అడుగుల విస్తీర్ణం కలిగిన బాటలను ఏర్పరచుకుని ఎండు ఆకులు, ఎండు కొమ్మలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కొమ్మల కత్తిరింపు

కాఫీ సాగులో కొమ్మల కత్తిరింపు చాలా కీలకం. ఏప్రిల్‌, మే నెలల్లో కాఫీ మొక్కలపైన కొత్తగా వచ్చిన నిటారు లేతకొమ్మలను ఏటవాలుగా కత్తిరించుకోవాలి. అలాగే అడ్డదిడ్డంగా(ఒక కొమ్మపై మరో కొమ్మ కలివుంటే)వున్న కొమ్మలను కూడా కత్తిరించుకోవాలి. ఈ కొమ్మలపై వచ్చిన నిటారు(గుర్రపుడెక్క) కొమ్మలను కూడా కత్తిరించుకోవాలి. ప్రతీ కొమ్మకు కాంతి తగిలేలా చూసుకోవాలి. ఎండుకొమ్మను కూడా తొలగించుకోవాలి. ఒక మొక్కలో 12-13 బలమైన దిగుబడినిచ్చే కొమ్మలు మాత్రమే వుండేలా చూసుకోవాలి. ఈ విధంగా కొమ్మల కత్తిరింపు పనులు చేసుకోవడం వల్ల దిగుబడినిచ్చే కొమ్మలకు పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. దీంతో కాఫీ దిగుబడి పెరుగుతుంది. నెల నుంచి రెండు అడుగులలోపు ప్రధాన కాండానికి ఇరువైపులా కొమ్మలు లేకుండా చూసుకోవాలి.

కలుపు నివారణ, అంతర్‌ కృషి

కాఫీ తోటల్లో కలుపు మొక్కలను తొలగించుకోవాలి. అలాగే మూడేళ్లలోపు మొక్కలకు చుట్టూ గొప్పు చేసుకుని గూడుకట్టుకోవడం మంచిది. మూడేళ్లలోపు మొక్కలకు రెండు కిలోల పశువులగెత్తం వేసుకోవాలి. అలాగే నాలుగేళ్లుపైబడిన ఒక్కొక్క మొక్కకు ఐదు కిలోల పశువుల గెత్తం వేసుకొని మొక్కల చుట్టూ గొప్పుచేసుకోవాలి.

కాండం తొలిచే పురుగు నివారణ కోసం..

కాఫీ మొక్కలకు సరైన నీడ లేకపోతే కాండం తొలిచే పురుగు ఆశిస్తుంది. మొక్కలపై ఎండ ప్రభావం ఎక్కువగా వుంటే ఈ పురుగు వ్యాప్తి అధికంగా వుంటుంది. ఈ పురుగు మొక్క ప్రధాన కొమ్మపై వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వందల సంఖ్యలో కాండం తొలిచే పురుగులు బయటకొచ్చి పంటను నాశనం చేసే ప్రమాదముంది. ఈ సమస్యను అధిగమించేందుకు రైతులు మొక్కల ప్రధాన కాండం కింద నుంచి పైభాగం వరకూ కొబ్బరిపీచు, గోనెసంచితో నునుపుగా చేసుకోవాలి. కాండాన్ని నునుపుగా చేసుకోవడం వల్ల కాండం తొలిచే పురుగు మొక్క కాండంపై గుడ్లుపెట్టినా అవి మొక్క కిందకు రాలిపోతాయి. ఈ పురుగు ప్రధాన కాండానికి చిన్నరంధ్రం చేసుకుని లోపలకు ప్రవేశిస్తుంది. కాండంలోనున్న పోషకాలను పీల్చివేస్తుంది. కాండం తొలిచే పురుగు ఆశించిన మొక్కల నుంచి కాఫీ దిగుబడి రాదు. ఈ మొక్కలను రైతులు గుర్తించి పూర్తిగా తొలగించుకుని కాల్చివేయాలి. ఈ మొక్కల స్థానంలో కొత్తగా మొక్కలను నాటుకోవాలి. అలాగే కాఫీ తోటకు పూర్తి స్థాయిలో నీడను కల్పించేందుకు నీడనిచ్చే మొక్కలను పెంపొందించుకోవాలి.

బోర్డో మిశ్రమంతో తెగుళ్ల నివారణ

కాఫీ పంటలో తెగుళ్లను నివారించుకునేందుకు వేసవిలో బోర్డో మిశ్రమం పిచికారీ చేసుకోవాలి. ఈ మిశ్రమం పిచికారీ చేసుకోవడం వల్ల ఆకుమచ్చ తెగులు, పొలుసు పురుగు, కాండం తొలిచే పురుగులను నియంత్రించుకోవచ్చు. అలాగే 1500 సీసీఎం వేపనూనె 5 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలుపుకుని మొక్కలపై పిచికారీ చేసుకోవాలి.

Updated Date - Apr 10 , 2025 | 11:25 PM