సుగంధ ద్రవ్యాల సాగుకు అనుకూలం
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:29 AM
మన్యం సుగంధ ద్రవ్య పంటల సాగుకు అత్యంత అనుకూలమని కేరళ కోజికోడ్ ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్(ఐఐఎస్‌ఆర్) ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్ తెలిపారు.
పసుపు, మిరియాలు, అల్లం పంటల్లో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే రెట్టింపు ఆదాయం
ఐసీఏఆర్-ఐఐఎస్‌ఆర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్
చింతపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): మన్యం సుగంధ ద్రవ్య పంటల సాగుకు అత్యంత అనుకూలమని కేరళ కోజికోడ్ ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్(ఐఐఎస్‌ఆర్) ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రసాద్ తెలిపారు. సుగంధ ద్రవ్య పంటలపై ఆధ్యయనం చేసేందుకు ఆంధ్ర పర్యటనలో భాగంగా ఐసీఏఆర్-ఐఐఎస్‌ఆర్ శాస్త్రవేత్తల బృందం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానానికి వచ్చింది. మంగళవారం ఉద్యాన పరిశోధన స్థానంలో పసుపు సాగులో ఆధునిక సేద్య పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు. బుధవారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో గిరిజన రైతులు సాగు చేస్తున్న పసుపు, అల్లం, మిరియాల పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఐసీఏఆర్-ఐఐఎస్‌ఆర్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ ప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా విభిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన ప్రాంతమన్నారు. ఈ ప్రాంత నేలలు, వాతావరణం సుగంధ ద్రవ్య పంటల సాగుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ ప్రాంతంలో పసుపు, అల్లం, మిరియాలతో పాటు దాల్చిన చెక్క, జాజికాయ, లవంగాలు సాగు చేసుకోవచ్చునన్నారు. ప్రధానంగా గిరిజనులు సాగు చేస్తున్న పసుపు, అల్లం పంటల్లో ఆధునిక సేద్య పద్ధతులు పాటిస్తే రెట్టింపు దిగుబడులు సాధించవచ్చునన్నారు. రైతులు ఎత్తైన మడుల్లో అల్లం, పసుపు నాటు కోవాలని సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల దిగుబడులు పెరగడంతో పాటు దుంపకుళ్లు తెగులును నివారించుకోవచ్చునని చెప్పారు. వర్షపు నీరు పంట పొలంలో నిలిచిపోకుండా ఉంటుందన్నారు. పసుపు పంటకు రెండేళ్ల సాగు విధానాన్ని విడిచిపెట్టాలన్నారు. శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మేలిరకం వంగడాలను తొమ్మిది నెలల పంట కాలంలో సాగు చేసుకోవాలన్నారు. కాఫీలో అంతర పంటగా గిరిజన రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారని, మిరియాల్లో తెగుళ్లను సకాలంలో నివారించుకోవడం మంచిదన్నారు. మిరియాల సేకరణలోనూ మెలకువలు పాటించాలన్నారు. బాగా పండిన గింజలను సేకరించి గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోవడం వల్ల మంచి ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ లిజో థామస్, శాస్త్రవేత్త డాక్టర్ నిస్సార్, హెచ్‌ఆర్‌ఎస్ అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు, టాటా ట్రస్టు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ అప్పలరాజు పాల్గొన్నారు.