Share News

కట్నం వేధింపులతోనే ఆత్మహత్య

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:03 AM

స్థానిక కనకమహాలక్ష్మినగర్‌లో వివాహిత తన ఆరు నెలల పసిబిడ్డను చంపి, ఆపై ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉపాధాయుడైన భర్త పెడుతున్న కట్నం వేధింపుల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

కట్నం వేధింపులతోనే ఆత్మహత్య
పెళ్లయిన కొత్తలో వీణ, ఉమామహేశ్వరరావు (ఫైల్‌ ఫొటో)

మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపణ

ఉపాధ్యాయుడైన భర్తపై పోలీసులు కేసు నమోదు

చోడవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక కనకమహాలక్ష్మినగర్‌లో వివాహిత తన ఆరు నెలల పసిబిడ్డను చంపి, ఆపై ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉపాధాయుడైన భర్త పెడుతున్న కట్నం వేధింపుల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

బుచ్చెయ్యపేట మండలం కేపీ అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పి.ఉమామహేశ్వరరావుచోడవరంలోని కనకమహాలక్ష్మిగర్‌లో భార్య వీణ(29) ఆరు నెలల కుమారుడు వియాన్‌తో నివాసం వుంటున్నాడు. బుధవారం సాయంత్రం ఆమె వియాన్‌ను చంపి, అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనకాపల్లి డీఎస్పీ శ్రావణి గురువారం ఉదయం ఇక్కడకు వచ్చి దర్యాప్తు చేపట్టారు. వీణ ఆత్మహత్య చేసుకున్న ఇంటిని పరిశీలించారు. క్లూస్‌ టీం సభ్యులు వచ్చి వీణ ఆత్మహత్యకు ఉపయోగించిన తాడును, ఇతర ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా మృతురాలి భర్త ఉమామహేశ్వరరావును డీఎస్పీ విచారించారు. వీణ తల్లిదండ్రులు, సోదరుడితో ఆమె మాట్లాడారు. వరకట్న వేధింపుల కారణంగానే వీణ ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. తమది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గుమడ గ్రామమని, ఇదే మండలానికి చెందిన ఉమామహేశ్వరరావు, వీణను ప్రేమించి 2024లో పెళ్లి చేసుకుడన్నారు. పెళ్లికి ముందు మూడు ఎకరాల పొలం అమ్మి ఉమామహేశ్వరరావుకు రూ.21 లక్షల కట్నంగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. కొంతకాలంపాటు భార్యతో సఖ్యతగానే వున్న అతను.. తరువాత మరింత కట్నం తేవాలంటూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని వారు ఆరోపించారు. భర్త వేధింపులపై పలుమార్లు తమకు ఫోన్‌ చేసి కన్నీంటిపర్యంతం అయ్యిందన్నారు. బుధవారం ఉదయం ఉమామహేశ్వరరావు స్కూలుకు వెళ్లే ముందు వీణతో గొడవ పెట్టుకుని, సూటిపోటి మాటలతో వేధించాడని, దీంతో తీవ్రమనస్తాపం చెందిన ఆమె తొలుత చిన్నారిని చంపేసి, అనంతరం తారు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుడిపై నమోదు: డీఎస్పీ

అదనపు కట్నం కోసం వేధించడం వల్లే వీణ ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేశామని అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆమె వెంట సీఐ బి.అప్పలరాజు, ఎస్‌ఐ నాగకార్తీక్‌ వున్నారు.

Updated Date - Nov 14 , 2025 | 01:03 AM