షుగర్స్ మహాజన సభ ఆరు నెలలపాటు వాయిదా
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:08 AM
గోవాడ సహకార చక్కెర కర్మాగారం మహాజన సభను ఆరు నెలలపాటు వాయిదా వేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్‌తోపాటు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఎండీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ
చోడవరం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గోవాడ సహకార చక్కెర కర్మాగారం మహాజన సభను ఆరు నెలలపాటు వాయిదా వేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్‌తోపాటు, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఎండీ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. వాస్తవానికి ఏటా సెప్టెంబరు నెలాఖరులోగా ఫ్యాక్టరీ మహాజన సభను నిర్వహిస్తుంటారు. అయితే గత ఏడాది ఫ్యాక్టరీకి సరఫరా అయిన చెరకుతోపాటు 2023-24 సీజన్‌కు సంబంధించి కొంత బకాయిలు కలిపి రైతులకు సుమారు రూ.29 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇంకా కార్మికులకు వేతనాలు, రిటైరయిన కార్మికులకు గ్రాట్యుటీ బకాయిలు మరో రూ.7 కోట్లు వుంటాయి. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప ఈ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు. ఆయా బకాయిల వివరాలతోపాటు, ఈ సీజన్‌లో ఫ్యాక్టరీని నడిపించేందుకు మరో రూ.10 కోట్లు అవసరమంటూ ఫ్యాక్టరీ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.ఈ నేపథ్యంలో మహాజన సభ నిర్వహణను ఆరు నెలలపాటు వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.