Share News

చెరకు రైతుకు దక్కని ఊరట

ABN , Publish Date - May 03 , 2025 | 12:45 AM

కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి చెరకు మద్దతు ధర టన్నుకు రూ.150 మాత్రమే పెంచడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెంచిన మద్దతు ధర కంటితుడుపుగా వుందని పెదవి విరుస్తున్నారు. గత ఏడాది టన్నుకు రూ.285 పెంచింది. ఈ ఏడాది మరికొంత పెంచుతుందని సాగుదారులు ఆశించారు.

చెరకు రైతుకు దక్కని ఊరట
చెరకు తోట

మద్దతు ధర అరకొరగా పెంపు

టన్నుకు రూ.150 మాత్రమే పెంచిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే టన్నుకు రూ.135 తక్కువ

గోవాడ రైతుల పరిస్థితి మరింత దయనీయం

కేంద్రం ప్రకటించిన ధర కంటే తక్కువ చెల్లింపు

పంచదార రికవరీ శాతం పడిపోవడమే కారణం

చెరకు సాగుకు మరింత మంది దూరం?

ఏడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, రికవరీ శాతం దృష్ట్యా గోవాడ రైతులకు దక్కిన ధర ఇలా వున్నాయి.

సంవత్సరం కేంద్ర గోవాడ రైతులకు

మద్దతు ధర దక్కిన ధర

2018-19 రూ. 2,750 రూ.2,681

2019-20 రూ. 2,750 రూ.2,612.5

2020-21 రూ. 2,850 రూ.2,707.5

2021-22 రూ. 2,900 రూ.2,755

2022-23 రూ. 3,000 రూ.2,821.25

2023-24 రూ. 3,115 రూ.2,919

2024-25 రూ. 3,400 రూ.3,230

2025-26 రూ.3,550 ప్రకటించాల్సి ఉంది

చోడవరం, మే 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి చెరకు మద్దతు ధర టన్నుకు రూ.150 మాత్రమే పెంచడంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెంచిన మద్దతు ధర కంటితుడుపుగా వుందని పెదవి విరుస్తున్నారు. గత ఏడాది టన్నుకు రూ.285 పెంచింది. ఈ ఏడాది మరికొంత పెంచుతుందని సాగుదారులు ఆశించారు. కానీ భారీగా తగ్గించేసి రూ.150కి పరిమితం చేసింది. కేంద్రం తీరు చెరకు రైతులను తీవ్రనిరాశకు గురిచేస్తున్నది. ఏటేటా చెరకు సాగు తగ్గిపోతున్న తరుణంలో మద్దతు ధరను సంతృప్తికర స్థాయిలో పెంచాల్సిన ప్రభుత్వం.. గత ఏడాదితో పోలిస్తే రూ.135 తగ్గించడం దారుణమని రైతులు అంటున్నారు. మద్దతు ధరల విషయంలో ప్రభుత్వ తీరు ఇదే విధంగా వుంటే చెరకు సాగుకు దూరం కావాల్సి వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ఇతర పంటలతో పోలిస్తే చెరకు సాగుకు పెట్టుబడి, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు మద్దతు ధర మొక్కుబడిగా పెంచుతుండడంతో చెరుకు సాగుదారులు నష్టాలపాలవుతున్నారు. ఈ కారణంగానే రైతులు చెరకు సాగుకు స్వస్తి చెప్పి, ఇతర పంటలవైపు మళ్లుతున్నారు. ప్రస్తుత అనకాపల్లి జిల్లా పరిధిలో ఒకప్పుడు 70 వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. ఇప్పుడు 15 వేల ఎకరాలకు తగ్గిపోయింది. మద్దుతు ధర ఆశాజనకంగా లేకపోవడంతో చెరకు సాగు మరింత తగ్గిపోయే ప్రమాదం వుంది.

గోవాడ రైతుల పరిస్థితి మరీ దయనీయం

చెరకు మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచినా గోవాడ చెరకు రైతులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. పంచదార రికవరీ 10.25 శాతం సాధించే షుగర్‌ ఫ్యాక్టరీల పరిధిలోని రైతులకు మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్రం ప్రకటించడమే దీనికి కారణం. వివిధ కారణాల వల్ల గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో గత కొన్ని సీజన్లుగా పంచదార రికవరీ తొమ్మిది శాతానికి మించడం లేదు. ఇటీవల ముగిసిన 2024-25 సీజన్‌లో పంచదార రికవరీ మరింత తగ్గిపోయినట్టు తెలిసింది. రికవరీ వివరాలను ఫ్యాక్టరీ అధికారులు రెండు, మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం వుంది. దీనినిబట్టి వచ్చే సీజన్‌లో చెరకు మద్దతు ధరను ఫ్యాక్టరీ అధికారులు ప్రకటిస్తారు.

నష్టపోతున్న గోవాడ రైతు

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో పంచదార రికవరీ శాతం ఆశాజనకంగా లేకపోవడంతో ఆ ప్రభావం రైతులపై పడుతున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకన్నా తక్కువ లభిస్తున్నది. ఉదాహరణకు 2024-25 క్రషింగ్‌ సీజన్‌లో కేంద్రం చెరకు మద్దతు ధర టన్నుకు రూ.3,400గా ప్రకటించింది. కానీ అంతకు ముందు క్రషింగ్‌ సీజన్‌లో వచ్చిన పంచదార రికవరీ శాతం ఆధారంగా గోవాడ షుగర్స్‌ యాజమాన్యం టన్నుకు రూ.3,230 మాత్రమే చెల్లిస్తున్నది. ఇటీవల ముసిగిన క్రషింగ్‌ సీజన్‌లో రైతులు లక్షల టన్నుల చిలుకు చెరకును ఫ్యాక్టరీకి సరఫరా చేశారు. టన్నుకు రూ.170 చొప్పున సుమారు రెండు కోట్ల రూపాయాల మేర రైతులు నష్టపోయాయి.

సాగు చేద్దామా.. వదిలేద్దామా..

కొన్నేళ్లుగా చెరకు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోతున్నది. కొంతమంది రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రావడంలేదు. దీంతో ఒక్కరొక్కరుగా చెరకు సాగు మానేస్తున్నారు. జిల్లాలో గతంలో నాలుగు షుగర్‌ ఫ్యాక్టరీలు వుండగా, వైసీపీ హయాంలో వీటిలో మూడు ఫ్యాక్టరీలు మూతపడిన విషయం తెలిసిందే. ఉన్న ఒకే ఒక్క గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితి త్రిశంకు స్వర్గంలో వుంది. గత సీజన్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తి రోజుల తరబడి క్రషింగ్‌ నిలిచిపోయింది. దీనివల్ల పంచదార రికవరీ శాతం మరింత తగ్గిపోతున్నది. ఒకప్పుడు ఐదు లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌ చేసిన గోవాడ ఫ్యాక్టరీ ఈ ఏడాది లక్షా 9 వేల టన్నులకే పరిమితమైంది. చెరకు సాగు గిట్టుబాటు కాక రైతులు వేరే పంటల వైపు మళ్లడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఫ్యాక్టరీ పరిస్థితి చూసి, పలువురు రైతులు చెరకు సాగు కొనసాగించాలా? లేకపోతే మానుకోవాలా? అన్న సందిగ్ధంంలో వున్నారు.

Updated Date - May 03 , 2025 | 12:45 AM