విజయవంతంగా పల్స్ పోలియో
ABN , Publish Date - Dec 21 , 2025 | 11:23 PM
జిల్లాలోని 64 పీహెచ్‌సీల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు.
తొలి రోజు 1,12,839 మంది చిన్నారులకు చుక్కల మందు
పాడేరురూరల్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 64 పీహెచ్‌సీల పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డి.కృష్ణమూర్తి నాయక్ తెలిపారు. జిల్లాలో 0-5 సంవత్సరాలు గల 1,29,959 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యం కాగా, మొదటి రోజైన ఆదివారం 1,12,839 మందికి(86.82 శాతం) చుక్కల మందు వేశామన్నారు. మిగిలిన 17,120 మంది చిన్నారులకు 22, 23 తేదీల్లో ఇళ్ల వద్దకే వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మినుములూరు పీహెచ్‌సీలో నిర్వహించిన కార్యక్రమంలో అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారిణి వి.సాయిశ్రీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని కిండంగి పంచాయతీ సేరుబయలు గ్రామంలో నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, గబ్బంగి పంచాయతీ కేంద్రంలో టీడీపీ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కోడా వెంకట సురేశ్‌కుమార్ పాల్గొని చిన్నారులకు చుక్కల మందు వేశారు.