గురుకులంలో కంప్యూటర్ విద్యాబోధన సక్సెస్
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:51 PM
స్థానిక గిరిజన సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య సత్ఫలితాలనిస్తున్నది. విద్యార్థులు వృత్తి విద్య కోర్సుతో పాటు కంప్యూటర్ విద్యపై పట్టు సాధించేందుకు గురుకులం అధికారులు గత ఏడాది ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు.
ప్రయోగాత్మకంగా చింతపల్లి కళాశాలలో ప్రారంభం
ఇంటర్ విద్యార్థులకు అదనపు కోర్సు
సీఏ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ శిక్షణ
వృత్తి విద్య కోర్సులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
చింతపల్లి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక గిరిజన సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన కంప్యూటర్ విద్య సత్ఫలితాలనిస్తున్నది. విద్యార్థులు వృత్తి విద్య కోర్సుతో పాటు కంప్యూటర్ విద్యపై పట్టు సాధించేందుకు గురుకులం అధికారులు గత ఏడాది ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. తొలి ఏడాది వృత్తి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కంప్యూటర్ కోర్సులోనూ రాణిస్తున్నారు. ఈ ఏడాది నూతనంగా వృత్తి విద్యలో చేరిన విద్యార్థులకు సైతం కంప్యూటర్ విద్యాబోధన జరుగుతోంది. ఈ మేరకు వృత్తి విద్య కోర్సులు కలిగిన ప్రతి కళాశాలలో కంప్యూటర్ విద్యాబోధన ప్రారంభించేందుకు గిరిజన సంక్షేమశాఖ గురుకులం అధికారులు కార్యాచరణ ప్రారంభించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వృత్తి విద్య కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ గురుకులం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు గత ఏడాది ఇంటర్ విద్యార్థులకు అదనపు కోర్సుగా కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గురుకులం అధికారులు జిల్లాలో తొలి విడతగా చింతపల్లి టీడబ్ల్యూ గురుకుల కళాశాలలో కంప్యూటర్ విద్యా బోధన అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానిక టీడబ్ల్యూ గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులతో పాటు వృత్తి విద్య కోర్సు అకౌంట్స్ అండ్ ట్యాక్స్(ఏఎన్‌టీ) గ్రూప్స్ ఉన్నాయి. ఏఎన్‌టీ కోర్సులో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో 20 సీట్లు చొప్పున ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో ఈ కోర్సుకు ప్రత్యేక డిమాండ్ ఏర్పడింది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని మరో ఏడాది పాటు కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సి వస్తున్నది. ఈ కారణంగా ఏఎన్‌టీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లేందుకు ఒక ఏడాది సమయం వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియెట్‌తో పాటు ఏఎన్‌టీ విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్ కోర్సులో శిక్షణ ప్రారంభించారు.
కళాశాలలో ప్రత్యేక ల్యాబ్
టీడబ్ల్యూ గురుకుల కళాశాలలో ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గురుకులం కార్యదర్శి శిక్షణకు అవసరమైన 15 న్యూ జెనరేషన్ డెస్క్‌టాప్ కంప్యూటర్లను చింతపల్లి కళాశాలకు పంపించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో ఒకేసారి పదిహేను మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ల్యాబ్ వద్ద థియరీ బోధన కోసం డిజిటల్ క్లాస్ రూం సిద్ధం చేశారు.
కంప్యూటర్ కోర్సులు
కళాశాలలో ఏఎన్‌టీ కోర్సులో విద్యాభ్యాసం చేస్తున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు బేసిక్ కోర్సులపై బోధన అందిస్తున్నారు. ప్రధానంగా డీటీపీ, ఎంఎస్ ఆఫీస్, ఫొటో షాప్, ట్యాలీ ఈఆర్‌పీ-9 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు కంప్యూటర్ అధ్యాపకులు సీతారాం, సుబ్బారావులు అందుబాటులో ఉన్నారు. అలాగే కళాశాలలోని విద్యార్థులందరికీ ఆన్‌లైన్ ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్‌లో ప్రవేశం పొందేందుకు ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులం విద్యార్థులకు సీఏ కోచింగ్ ఇచ్చేందుకు మాస్టర్‌మైండ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రూ.వేలల్లో ఫీజు చెల్లించి పొందాల్సిన కోచింగ్ విద్యార్థులకు గురుకులం అధికారులు ఉచితంగా అందిస్తున్నారు. కళాశాలలో ఎనిమిది డిజిటల్ తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు రోజూ మూడు నుంచి ఐదు గంటల వరకు సీఏ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ ఇస్తున్నారు.