Share News

నత్తనడకన ఉప ఖజానా కార్యాలయ పనులు

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:09 AM

నర్సీపట్నం ఉప ఖజానా కార్యాలయ నూతన భవన నిర్మాణం నత్తనడకన సా..గుతోంది. కాంట్రాక్టర్‌ పనిచేసిన ప్రాప్తికి బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణంలో జాప్యమవుతోంది. దీంతో కార్యాలయంలో రికార్డులకు రక్షణ లేకుండా పోయింది. అధికారులు పని చేసుకోవడానికి సరైన ఫర్నిచర్‌ లేదు. సకాలంలో పూర్తి కాకపోవడంతో శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

నత్తనడకన ఉప ఖజానా కార్యాలయ పనులు
అధ్వానంగా ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్న ఎస్‌టీవో

వందేళ్ల నాటి భవనంలో సబ్‌ ట్రెజరీ నిర్వహణ

వర్షం వస్తే కారుతున్న భవనం

రికార్డులకు రక్షణ లేక ఇబ్బందులు

కొత్త భవనం కోసం 2022లో రూ.75లక్షలు మంజూరు

బిల్లులు మంజూరు కాక నేటికీ పూర్తి కాని నిర్మాణం

నర్సీపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

నర్సీపట్నం ఉప ఖజానా కార్యాలయ నూతన భవన నిర్మాణం నత్తనడకన సా..గుతోంది. కాంట్రాక్టర్‌ పనిచేసిన ప్రాప్తికి బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణంలో జాప్యమవుతోంది. దీంతో కార్యాలయంలో రికార్డులకు రక్షణ లేకుండా పోయింది. అధికారులు పని చేసుకోవడానికి సరైన ఫర్నిచర్‌ లేదు. సకాలంలో పూర్తి కాకపోవడంతో శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ ఉద్యోగులు పనిచేస్తున్నారు.

నర్సీపట్నం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో బ్రిటీష్‌ ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనంలో సబ్‌ ట్రెజరీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. వర్షం పడిందంటే కార్యాలయంలోని నీరు కారకుండా ప్లాస్టిక్‌ కవర్లు కట్టుకొని పనిచేసుకుంటున్నారు. శ్లాబ్‌ పాడవ్వడంతో భవనం పైకప్పు నుంచి వర్షం నీరు కారిపోయి గచ్చులు మడుగులా తయారు అవుతున్నాయి. తడికి చెక్క బీరువాలు చెదపట్టి పాడయ్యాయి. బీరువాలలోని పాత దస్త్రాలకు చెద పడుతున్నాయి. అధికారులు పనిచేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేవు. ఫర్నిచర్‌ కూడా పాతకాలం నాటివే వాడుతున్నారు. కార్యాలయం దుమ్ము, దూళితో నిండి ఉంది. సీలింగ్‌ రాలి పోతోంది. సబ్‌ ట్రెజరీ అధికారి గది వర్షానికి కారిపోతుండడంతో చిన్న జాగాని ఆఫీసు రూమ్‌గా మార్చుకొని పనిచేసుకుంటున్నారు.

సా...గుతున్న నిర్మాణ పనులు

సబ్‌ ట్రెజరీ కార్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వం 2022లో నర్సీపట్నం, కోటవురట్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయాలకు రూ.75లక్షలు చొప్పున మంజూరు చేసింది. ఏడాది తర్వాత టెండర్లు ప్రక్రియ చేపట్టింది. గత ఏడాది ఏప్రిల్‌లో కాంట్రాక్టర్‌ నిర్మాణ పనులు ప్రారంభించి, పునాదులు, ఫిల్లర్లు వరకు నిర్మాణం చేసిన తర్వాత చాలా కాలం పనులు ఆపేశారు. తర్వాత రెండు అంతస్తులు శ్లాబ్‌లు వేసి మళ్లీ పనులు ఆపేశారు. కాంట్రాక్టర్‌కి బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు పడుతూ లేస్తూ జరుగుతున్నాయి. ప్రస్తుతం గోడల నిర్మాణం జరుగుతోంది. పనులు మొదలు పెట్టి 20 నెలలు కావస్తున్నది. త్వరగతిన పూర్తి చేస్తే ట్రెజరీ కార్యాలయాన్ని కొత్త భవనంలోకి తరలిద్దామని అధికారులు ఎదురు చూస్తున్నారు.

బిల్లులు మంజూరు కాకపోవడమే కారణం

బిల్లులు మంజూరు కాకపోవడడం వలనే నర్సీపట్నం, కోటవురట్ల సబ్‌ ట్రెజరీ కార్యాలయాల కొత్త భవనాల పనులు ముందుకు సాగడం లేదు. కోటవురట్లలో 80 శాతం పనులు పూర్తి చేశారు. నర్సీపట్నం 40 శాతం పనులు అయ్యాయి. పనులు పూర్తి చేసిన ప్రాప్తికి కాంట్రాక్టర్‌కి బిల్లులు మంజూరు కాలేదు.

Updated Date - Sep 20 , 2025 | 01:09 AM