గీత దాటుతున్న ఎస్‌ఐలు!
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:14 AM
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐలు) కొందరు బరితెగించి వ్యవహరిస్తున్నారు.
24 మందిపై ఆరోపణలు
వారందరినీ రేంజ్‌కు సరండర్ చేయాలని నగర పోలీస్ కమిషనర్ నిర్ణయం
మొదటి విడతలో ఐదుగురు...
ఆరోపణలు కలిగిన మిగిలిన వారిని కూడా దశల వారీగా పంపించేందుకు యోచన
మరోవైపు అంతర్గత బదిలీలకు రంగం సిద్ధం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్లు (ఎస్‌ఐలు) కొందరు బరితెగించి వ్యవహరిస్తున్నారు. సీఐలు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో తమను అడిగేవారే లేరన్న భావనలో ఉంటున్నారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడడంతోపాటు స్టేషన్‌కు వచ్చే బాధితులపై ఇష్టానుసారం నోరుపారేసుకుంటున్నారు. ఇది ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల ప్రతికూల భావనకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఐల వ్యవహారంపై నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చికి సమాచారం అందడంతో ప్రక్షాళనకు నడుంబిగించారు.
నగరవాసులకు సీపీ శంఖబ్రతబాగ్చి రేయింబవళ్లు అందుబాటులో ఉంటున్నారు. తన వ్యక్తిగతఫోన్ నంబర్‌ను సైతం ఇచ్చి సహాయం కోసం ఏ సమయంలోనైనా సంప్రతించవచ్చునని ప్రకటించారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసినా ఆయనే స్వయంగా బాధితులతో మాట్లాడి వారికి కావాల్సిన సహాయాన్ని అందజేస్తున్నారు. పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే వారిని నిరాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తున్నారు. దీంతో నగరంలో పనిచేయడానికి కొందరు సీఐలు భయపడి రేంజ్‌కు వెళ్లిపోయారు. అక్కడి నుంచి నగరానికి రావడానికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. కానీ ఎస్‌ఐ స్థాయిలో మాత్రం కొందరు అవినీతికి పాల్పడుతుండడం పోలీస్ శాఖ ప్రతిష్ఠకు మచ్చగా తయారైంది. సాధారణంగా ఎస్‌ఐ స్థాయిలో పనిచేస్తున్నవారు విధి నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తాము చేసే పని వెంటనే సీఐలకు తెలిసిపోతుందనే భయంతో ఉంటారు. సీఐలపై ఎలాగూ ఏసీపీ, ఏడీసీపీ, డీసీపీ, సీపీ స్థాయి అధికారుల దృష్టి ఉంటుంది. అయితే నగరంలో పనిచేస్తున్న కొందరు ఎస్‌ఐలు తమ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలుగా పనిచేస్తున్న సీఐలనే లెక్కచేయడం లేదని చెబుతున్నారు. స్టేషన్‌కు ఏదైనా ఫిర్యాదు రావడమే తరువాయి అన్నట్టు ఆ పిటిషన్‌ను తమకు ఇవ్వాలంటూ సీఐలను నేరుగా కోరుతున్నారు. కొంతమంది సీఐలు కూడా తాము ప్రశాంతంగా ఉండాలనే భావనతో వారు కోరినట్టే చేస్తున్నారు. కొంతమంది ఎస్‌ఐలు ఆ పిటిషన్‌ను పరిశీలించిన తర్వాత బాధితులతోపాటు అవతలి వారిని స్టేషన్‌కు పిలిచి మాట్లాడుతున్నారు. వారిలో ఎవరు తమను ప్రసన్నం చేసుకునేందుకు సుముఖత చూపుతున్నారో చూసి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే తమ స్టేషన్ పరిధి కాకపోయినాసరే సివిల్ కేసులు అయితే తలదూర్చేస్తున్నారు. తమను ప్రసన్నం చేసుకున్న వారికి ప్రయోజనం చేకూర్చేలా రెండో వర్గం వారిని అరుపులు, కేకలతో భయాందోళనకు గురిచేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తాము ఎందుకు సెటిల్ చేసుకోవాలి, కోర్టులోనే తేల్చుకుంటామని సమాధానం చెబితే వారిని లాకప్‌లో పెట్టి దారికి తెచ్చుకుంటున్నారంటున్నారు. ఏదో విధంగా వ్యవహారాన్ని సెటిల్ చేసి తమ వాటాను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొందరైతే తమ ఇళ్లకు పండ్లు, చికెన్, మటన్‌తోపాటు ఫుడ్ పార్శిళ్లు, కూరగాయలు వంటి వాటిని కూడా సంబంధిత వ్యాపారుల నుంచి తెప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఎస్‌ఐల అవినీతి, విధినిర్వహణలో అలక్ష్యంపై దృష్టిసారించిన సీపీ:
నగరంలో అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎస్‌ఐలపై సీపీ దృష్టిసారించారు. అలాంటి వారికి సంబంధించి పూర్తిసమాచారం తెప్పించుకుని 24 మందిని నగరం నుంచి బయటకు పంపించేయాలని నిర్ణయించారు. ఆ జాబితాను రేంజ్ డీఐజీకి పంపించారు. అయితే అంతమందిని ఒకేసారి తీసుకుని, అంతే సంఖ్యలో ఎస్‌ఐలను తిరిగి నగరానికి ఇవ్వడం కొంత ఇబ్బందితో కూడుకున్నది కావడంతో విడతల వారీగా పంపించాలని సీపీని రేంజ్ అధికారులు కోరినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మొదటి దశగా ఐదుగురు ఎస్‌ఐలను నగరం నుంచి రేంజ్‌కు సరండర్ చేశారంటున్నారు. త్రీటౌన్ క్రైమ్ ఎస్‌ఐగా పనిచేస్తున్న మహ్మద్ సల్మాన్‌బేగ్, పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్‌ఐ గొండేల ప్రసాద్, ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్‌ఐ ఎ.విజయ్‌కుమార్, టూటౌన్ క్రైమ్ ఎస్‌ఐ నిమ్మకాయల సునీల్, భీమిలి ఎస్‌ఐ ఎం.భరత్‌కుమార్‌రాజును రేంజ్‌కు సరండర్ చేశారు. మిగిలిన వారిని కూడా దశలవారీగా రేంజ్‌కు సరండర్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు నగరంలో పనిచేస్తున్న ఎస్‌ఐలను అంతర్గత బదిలీ చేయాలని సీపీ నిర్ణయించారు. దీనికోసం కసరత్తు కూడా తుదిదశకు చేరడంతో జాబితాను నేడో, రేపో విడుదల చేసే అవకాశం ఉంది. నగరానికి వచ్చిన ట్రైనీ ఎస్‌ఐలకు ప్రొబేషన్ పూర్తవ్వడంతో వారందరికీ స్టేషన్‌ను కేటాయించే అవకాశం ఉంది.